Kharge on Modi and Election Commission : రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ఎన్నికల సంఘం (ఈసీ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కీలుబొమ్మగా మారిందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై చెలరేగిన దుమారం, ఖర్గే చేసిన వ్యాఖ్యలతో దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. అసలు రాజ్యాంగ వ్యవస్థలపై ఇంతటి తీవ్రమైన ఆరోపణలు చేయడానికి దారితీసిన పరిస్థితులేమిటి..? ప్రతిపక్షాల ఆందోళనలో నిజమెంత…?
దశలవారీగా ఆరోపణల పరంపర..
ఎన్నికల సంఘంపై గురి: “ప్రధాని మోదీ, బీజేపీ ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం పెను ప్రమాదంలో ఉంది” అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘రాజ్యాంగ సవాళ్లు – దృక్పథాలు, మార్గాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “బిహార్‌లో ప్రత్యేక సవరణ పేరుతో సుమారు 65 లక్షల మంది ఓటర్లను తొలగించేందుకు కుట్ర జరుగుతోంది. బీజేపీ పాలనతో విసిగిపోయి కాంగ్రెస్‌కు ఓటు వేస్తారన్న అక్కసుతో పేదలు, దళితులు, మైనారిటీల ఓటు హక్కును కాలరాయాలని ఎన్నికల సంఘం చూస్తోంది,” అని ఖర్గే సంచలన ఆరోపణ చేశారు. “ఇది ఎన్నికల కమిషనా లేక మోదీజీ కీలుబొమ్మా?” అని ఆయన నిలదీశారు.
ఓటర్ల జాబితాలో అవకతవకలు: కేవలం బిహార్‌కే పరిమితం కాకుండా, ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఖర్గే ఆరోపించారు. కర్ణాటకలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లను మార్చేసిన ఉదంతాన్ని రాహుల్ గాంధీ బయటపెట్టారని, దానికి తమ వద్ద ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. “మహారాష్ట్రలో ఒకే హాస్టల్‌లో తొమ్మిది వేల మంది ఓటర్లు, ఒక చిన్న గదిలో తొమ్మిది మంది ఓటర్లు ఎలా ఉంటారు…?” అని ఆయన ప్రశ్నించడం గమనార్హం.
‘400 పార్’ నినాదం వెనుక కుట్ర: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇచ్చిన ‘400 పార్’ నినాదం రాజ్యాంగాన్ని మార్చడానికేనని ఖర్గే తీవ్ర ఆరోపణ చేశారు. “ఒకవేళ బీజేపీకి 400 సీట్లు వచ్చి ఉంటే, ఈపాటికి రాజ్యాంగాన్ని మార్చేసి ఉండేవారు. కానీ దేశ ప్రజలు వారి అహంకారాన్ని దెబ్బతీసి, గట్టిగా బుద్ధి చెప్పారు,” అని ఆయన ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ చేసిన పోరాటమే దీనికి కారణమని కొనియాడారు.
మోదీపై వ్యక్తిగత విమర్శలు: ప్రధాని మోదీ పనితీరుపైనా ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. “శ్రావణ మాసంలో ముఖ్యమైన అంశాలపై మాట్లాడకుండా ఉండేందుకు మోదీ మౌనవ్రతం ఎంచుకున్నారు” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఎన్నికల ప్రచారంలో మోదీ నిత్యం ‘మొఘలులు, మంగళసూత్రం’ అంటూ సమాజాన్ని విభజించే ప్రయత్నం చేస్తారని, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఆయనే దాన్ని అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటుకు వచ్చినా సభకు హాజరుకాకుండా తన కార్యాలయంలో టీవీలో కార్యకలాపాలు చూస్తారని, ఆయన దేనికి భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.
సోనియా గాంధీ మద్దతు : ఖర్గే ఆరోపణలకు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ గొంతు కలిపారు. ప్రజాస్వామ్య గణతంత్రాన్ని కొద్దిమందికి సేవ చేసే ‘దైవపరిపాలనా కార్పొరేట్ రాజ్యం’గా మార్చేందుకు బీజేపీ సైద్ధాంతిక తిరుగుబాటుకు ప్రయత్నిస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు స్వాతంత్ర్యం కోసం పోరాడలేదని, వారు ఎప్పుడూ సమానత్వాన్ని సమర్థించలేదని, ఇప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజ్యాంగాన్ని కూల్చివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. వారి సైద్ధాంతిక పూర్వీకులు మనుస్మృతిని కీర్తించి, త్రివర్ణ పతాకాన్ని తిరస్కరించారని గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని అణగదొక్కే ప్రతి ప్రయత్నాన్ని పార్లమెంటులో, కోర్టుల్లో, వీధుల్లో కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని ఆమె స్పష్టం చేశారు.


