Kharge Alleges BJP Incompetence: దేశంలో వరుసగా జరుగుతున్న వంతెన ప్రమాదాలు, విమాన ప్రమాదాలు పౌరులలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ విషాద ఘటనలకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలన, అవినీతే కారణమని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విమర్శించారు. గుజరాత్‌లో ఇటీవల జరిగిన వంతెన కూలిపోవడం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి ఘటనలు బీజేపీ పాలన లోపాలను స్పష్టం చేస్తున్నాయని ఖర్గే ఆరోపించారు. ఈ నేపథ్యంలో దేశంలో భద్రత ప్రశ్నార్థకంగా మారిందా? బీజేపీ ప్రభుత్వానిది నిర్లక్ష్యమా? ఈ వరుస ప్రమాదాలకు అసలు కారణాలేంటి?
12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు:
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాటల తూటాలు పేల్చారు. బీజేపీ నాయకత్వంలోని సంక్షోభం, అసమర్థ పాలన దేశంలోని అన్ని విభాగాల్లో అవినీతిని పెంచిందని ఆయన ధ్వజమెత్తారు. దీనికి నిదర్శనంగానే గుజరాత్‌లో వంతెన కూలిపోవడం, అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం వంటి విషాద ఘటనలు జరిగాయని ఖర్గే స్పష్టం చేశారు. సరైన సమయంలో ప్రజలు బీజేపీ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
ఖర్గే తన ఎక్స్ పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు:
“దేశంలో ప్రమాదాలు సర్వసాధారణం అయ్యాయి. కొన్ని సార్లు రైలు ప్రమాదాలు. మరికొన్ని సార్లు వంతెనలు ప్రారంభించిన కొద్దిరోజులకే పగుళ్లు ఏర్పడటం. అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం నుంచి ప్రజలు ఇంకా కోలుకోకముందే వంతెన ప్రమాదం జరిగింది. ఆ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. 12 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. నివేదికల ప్రకారం మూడేళ్ల క్రితమే వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయి. అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2021 నుంచి గుజరాత్‌లో ఇది ఏడో వంతెన ప్రమాదం.” ఈ వ్యాఖ్యలు బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి.
ప్రసంగాలు, ప్రకటనలతో బిజీగా ఉన్న బీజేపీ నాయకత్వం, ప్రజల బాధలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. “పరిపాలన పేరుతో విస్మరణకు హద్దులు దాటాయి. ఇదంతా నాయకత్వం సంక్షోభం, విపరీతంగా పెరిగిపోయిన అవినీతి, అసమర్థత ఫలితమే. దేశ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన విధంగా బదులు ఇస్తారని ఆశిస్తున్నాం” అని ఖర్గే తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/thane-school-incident-girls-checked/
వడోదర వంతెన ప్రమాదం – మృతుల సంఖ్య 15కు:
తాజాగా గుజరాత్‌లోని వడోదరలో వంతెన కూలి వాహనాలు నదిలో పడ్డ ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. మహిసాగర్ నదిపై 40 ఏళ్లనాటి పాత వంతెన బుధవారం కూలిపోవడంతో జరిగిన ఘోర ప్రమాదంలో గల్లంతైన వారిలో మరో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగింది. అయితే, ఇంకా నలుగురి ఆచూకీ లభ్యం కాలేదని ఎన్డీఆర్ఎఫ్ (National Disaster Response Force) వెల్లడించింది. నదిలో మరో రెండు వాహనాలను గుర్తించినట్లు కూడా తెలిపింది. ఈ దుర్ఘటనలో వంతెనపై ప్రయాణిస్తున్న పలు వాహనాలు నదిలో పడిపోయాయి. కొందరు అదృష్టవశాత్తూ స్వల్ప గాయాలతో బయటపడగా, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/x-ceo-linda-yaccarino-resigns/
ఆర్థిక సాయం:
ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు చొప్పున ఆర్థిక సాయం ప్రకటించాయి. అలాగే, గాయపడిన వారికి చెరో రూ.50 వేల ఆర్థిక సాయం అందించనున్నట్లు కూడా ప్రకటించాయి. గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.


