Kishan Reddy : కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి రాజకీయ నాయకులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటే స్వచ్ఛందంగా పదవుల నుంచి వైదొలగాలని సూచించారు. లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు (130వ సవరణ, 2025) ఈ విషయంలో కీలకమని తెలిపారు. దిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ బిల్లు నైతిక విలువలను కాపాడేందుకు తీసుకొచ్చామని చెప్పారు.
ALSO READ: Kavitha : టీబీజీకేఎస్‌లో కవిత శకం ముగింపు.. పదేళ్ల ప్రస్థానంపై వీడని వివాదాల నీడలు!
ఇక లోక్ సభలో తాజాగా ప్రవేశ పెట్టిన బిల్లు అవినీతి లేదా తీవ్ర నేర ఆరోపణలతో 30 రోజుల పాటు అరెస్ట్‌లో ఉన్న ముఖ్యమంత్రులు లేదా ప్రధానమంత్రిని తొలగించేందుకు ఉద్దేశించిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణంలో ఆరు నెలలకు పైగా జైలులో ఉన్న కేజ్రీవాల్, అక్కడి నుంచే అధికారులతో సమావేశాలు నిర్వహించి, పాలనను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అలాగే, తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ జైలులో ఉన్నప్పటికీ రాజీనామా చేయలేదని విమర్శించారు. ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) ద్వారా చర్చించి, న్యాయ నిపుణులు, ప్రజల సలహాలతో ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ, లోక్‌సభలో గందరగోళం సృష్టించిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. “ఈ బిల్లు వల్ల అవినీతిలో మునిగిపోయిన రాజకీయ నాయకులకు బాధ కలుగుతోందని.. కాంగ్రెస్‌కు ఎందుకు అభ్యంతరం?” అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించే నాయకులను ఉపేక్షించబోమని, ఈ బిల్లు పారదర్శకతను తెస్తుందని తెలిపారు. ముందు ముందు మరో మూడు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తప్పదని హెచ్చరించారు.
ఇక ఈ బిల్లు తెలంగాణ రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై కేసీఆర్, హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, కిషన్ రెడ్డి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.


