Sunday, February 2, 2025
Homeట్రేడింగ్Union Budget: బడ్జెట్ విశేషాలు ఓసారి తెలుసుకుందామా..?

Union Budget: బడ్జెట్ విశేషాలు ఓసారి తెలుసుకుందామా..?

మరికాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) 2025-26 వార్షిక బడ్జెట్‌(Union Budget)ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్‌ కోసం దేశమంతా ఆతృతగా ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఓసారి బడ్జెట్ విశేషాలు తెలుసుకుందాం. బ్రిటీష్ పాలన నుంచి ఇండియాలో బడ్జెట్ ప్రవేశపెట్టే సంప్రదాయం కొనసాగుతోంది.

- Advertisement -

₹ కరోనా కారణంగా 2021లో తొలిసారి పూర్తిగా కాగిత రహిత బడ్జెట్‌ను తయారుచేశారు.

₹ భారత్‌ తొలి బడ్జెట్‌ను 1860 ఏప్రిల్‌ 7న ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన స్కాటిష్‌ ఆర్థికవేత్త జేమ్స్‌ విల్సన్‌ ప్రవేశపెట్టారు. తెల్లదొరల పాలనపై పోరాడుతున్న వారిని అణిచివేసేందుకు బ్రిటీష్ ప్రభుత్వం భారీగా ఖర్చుపెట్టేది. దీంతో భారత ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేయడానికి 1859లో ఓ కమిటీని నియమించారు. అనంతరం తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టారు.

₹ స్వాతంత్ర్యం వచ్చాక తొలి బడ్జెట్‌ను నాటి ఆర్థిక మంత్రి షణ్ముఖమ్‌ చెట్టి 1947 నవంబర్‌ 26న ప్రవేశపెట్టారు. కేవలం ఏడున్నర నెలల కాలానికి మాత్రమే దానిని రూపొందించారు.

₹ 1977లో నాటి ఆర్థిక మంత్రి హీరుభాయ్‌ ముల్జిభాయ్‌ పటేల్‌ అతిచిన్న బడ్జెట్‌ను(కేవలం 800 పదాలతో) ప్రవేశపెట్టారు.

₹ అత్యధిక పదాలు ఉన్న బడ్జెట్‌ సమర్పించిన రికార్డు మన్మోహన్‌ సింగ్‌ పేరిట ఉంది. ఆయన 1991లో 18,650 పదాలతో పద్దును సమర్పించారు.

₹ 2020లో 2.42 గంటల మేర బడ్జెట్‌పై మాట్లాడి ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రికార్డ్ సృష్టించారు.

₹ 1950లో బడ్జెట్‌ కాపీలు లీక్‌ అయ్యాయి. దీంతో ముద్రణ ప్రక్రియ మొత్తాన్ని నార్త్‌బ్లాక్‌లోని బేస్‌మెంట్‌కు తరలించారు.

₹ దాదాపు 92 ఏళ్లపాటు రైల్వే, యూనియన్‌ బడ్జెట్‌ను వేర్వేరుగా సమర్పించేవారు. కానీ 2017లో ఈ సంప్రదాయానికి ముగింపు పలికారు.

₹ 1955 వరకు యూనియన్‌ బడ్జెట్‌ను పూర్తిగా ఇంగ్లీష్‌లోనే ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నుంచి పద్దు హిందీ, ఇంగ్లిష్‌ల్లో ముద్రించడం మొదలైంది.

₹ 1999 వరకు ఫిబ్రవరి నెల చివరి తేదీన సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. కానీ అప్పటి ఆర్థిక మంత్రి యశ్వంత్‌ సిన్హా ఉదయం 11 గంటలకే బడ్జెట్ ప్రవేశపెట్టారు.

₹ 2017లో నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News