ఓ విడాకుల కోసులో మధ్యప్రదేశ్ హైకోర్టు(Madhya Pradesh High Court) సంచలన తీర్పు ఇచ్చింది. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న జంట మధ్య మనస్పర్థలు తలెత్తాయి. భార్య తన పాత లవర్స్‌తో అసభ్యంగా చాటింగ్ చేస్తోందని భర్త ఆరోపించాడు. అయితే ఆరోపణలను ఖండించిన ఆమె తన మొబైల్‌ను హ్యాక్ చేసి తప్పుడు సందేశాలు సృష్టించారని పేర్కొంది. అంతేకాకుండా భర్త తన గోప్యతను ఉల్లంఘించాడని.. రూ.25 లక్షల వరకట్నం డిమాండ్ చేశాడని ఆరోపించింది. దీనిపై విడాకుల కోసం స్థానిక కోర్టును భర్త ఆశ్రయించగా.. విడాకులు మంజూరు చేసింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ భార్య హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ రొసియా, జస్టిస్ గజేంద్ర సింగ్‌లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహానంతరం భార్యాభర్తలు స్నేహితులతో హుందాగా, గౌరవంగా వ్యవహరించాలని సూచించింది. శృతి మించితే అది మనోవేదనకు దారితీస్తుందని పేర్కొంది. భార్య మరో పురుషుడితో అశ్లీల చాటింగ్ చేస్తే అది భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించబడుతుందని అభిప్రాయపడింది. ఈ తరహా ప్రవర్తనను ఏ భర్త సహించలేడని తేల్చి చెప్పింది. భార్య తన స్నేహితుడితో లైంగికపరమైన విషయాలు చర్చిస్తూ అసభ్యంగా చాట్ చేసినట్లు గుర్తించింది. అనంతరం దిగువ కోర్టు మంజూరు చేసిన విడాకులను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.