Maharashtra cabinet: మహారాష్ట్రలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరింది. మహాయుతి ప్రభుత్వంలో కొత్తగా 37 మంది మంత్రులు ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. నాగ్‌పుర్‌లోని రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ మంత్రులతో ప్రమాణం చేయించారు. ఇందులో 19 మంది బీజేపీ, 11 మంది శివసేన, 7 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari), ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis), ఉపముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde), అజిత్ పవార్ (Ajit Pawar) హాజరయ్యారు.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో డిసెంబర్ 5న బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా మూడోసారి బాధ్యతలు చేపట్టగా.. డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ ఆరోసారి బాధ్యతలు చేపట్టారు.