Minister playing rummy in assembly : చట్టసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన ఓ మంత్రిగారు, ఫోనులో రమ్మీ ఆడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఈ ఘటనపై విపక్షాలు భగ్గుమనడంతో ప్రభుత్వం ఆయనపై చర్యలకు ఉపక్రమించింది. అయితే ఆ చర్యే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆటలాడినందుకు శిక్షగా ఏకంగా క్రీడా శాఖనే ఆయనకు కట్టబెట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది! ఇంతకీ ఎవరా మంత్రి..? అసలు ఏం జరిగింది..? ఈ శాఖ మార్పు వెనుక ఉన్న ఆంతర్యమేంటి..?
ఆట రచ్చ రచ్చ… శాఖ మార్పు గమ్మత్తు : శాసన మండలి సమావేశాలకు హాజరైన సమయంలో తన స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ రమ్మీ ఆడుతూ అడ్డంగా దొరికిపోయిన మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత మాణిక్‌రావ్ కోకాటేపై ప్రభుత్వం వేటు వేసింది. అయితే ఈ చర్య శిక్షలా కాకుండా ఓ వింత బహుమతిలా ఉండటం గమనార్హం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా, రైతుల బాగోగులు చూడాల్సిన వ్యవసాయ శాఖ నుంచి ఆయన్ను తప్పించి, క్రీడలు మరియు యువజన సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుత క్రీడా మంత్రి దత్తాత్రేయ భర్నేకు వ్యవసాయ శాఖను కేటాయిస్తూ సాధారణ పరిపాలన శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అసలేం జరిగిందంటే : మహారాష్ట్ర శాసన మండలి వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో, సభలో చర్చ జరుగుతుండగా మంత్రి మాణిక్‌రావ్ కోకాటే తన ఫోన్‌లో నిమగ్నమైపోయారు. ఆయన ఆన్‌లైన్‌లో రమ్మీ ఆడుతున్న దృశ్యాలను తోటి ఎన్సీపీ నేతలైన రోహిత్ పవార్, జితేంద్ర అవ్హాద్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా దుమారం రేగింది. రాష్ట్రంలో రైతులు రోజుకు 8 మంది చొప్పున ఆత్మహత్యలకు పాల్పడుతుంటే, వ్యవసాయ మంత్రికి చీమకుట్టినట్టయినా లేదని, బాధ్యతారహితంగా ఆన్‌లైన్ గేమ్‌లు ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. కోకాటేను తక్షణమే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఆయన శాఖను మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
మంత్రిగారి వివరణ ఇదీ : ఈ ఆరోపణలపై మంత్రి కోకాటే స్పందిస్తూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. తాను రమ్మీ ఆడలేదని, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్‌లో చూస్తున్నానని తెలిపారు. “యూట్యూబ్ వీడియో ఓపెన్ చేయగానే ప్రకటనలు వస్తాయి కదా! అలాగే ఓ గేమ్ ప్రకటన వచ్చింది. నేను దానిని స్కిప్ చేసే సమయంలో వీడియో తీసి వైరల్ చేశారు. అది కేవలం 18 సెకన్ల వీడియో మాత్రమే. నా పనిని చూడలేని రోహిత్ పవార్ కావాలనే నన్ను లక్ష్యంగా చేసుకున్నారు” అని కోకాటే ఆరోపించారు.
గతంలో కూడా కోకాటే రైతులను బిచ్చగాళ్లతో పోల్చి తీవ్ర విమర్శల పాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రమ్మీ వివాదంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.


