Kejriwal| ఢిల్లీ(Delhi)లో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆ రాష్ట్ర మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్రలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆయన చేస్తున్న పాదయాత్రలోకి ఓ యువకుడు చొరబడి కేజ్రీవాల్‌పై దాడికి యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన ఆప్ నేతలు, కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకుని చితకబాదారు. దీంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా పాదయాత్రకు ముందు కేజ్రీవాల్ మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో నిత్యం కాల్పులు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఢిల్లీని కొంతమంది గ్యాంగ్‌స్టర్లు నడిపిస్తున్నారని మండిపడ్డారు.
ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో మరోసారి సత్తా చాటేందుకు ఆప్ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లొచ్చిన కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేసి అతిశీకి ఆ బాధ్యతలు అప్పగించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పుతో మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపడతానని తెలిపారు. మరోవైపు బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో హస్తిన ఎన్నికలు రసవత్తరంగా మారాయి.