ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్(Encounter) చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం బీజాపూర్ నేషనల్ పార్క్‌లో కూంబింగ్ చేపట్టిన డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో భద్రతా దళాల, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మొత్తం 31 మంది మావోయిస్టులు మరణించినట్టు బస్తర్ ఏరియా ఐజీ సుందర్ రాజ్ వెల్లడించారు ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. మావోయిస్టుల కోసం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.
ఇటీవల కాలంలో ఛత్తీస్‌గఢ్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు భారీగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాకుండా కీలక నేతలు మృతిచెందడం మావోయిస్టులకు భారీ నష్టం చేకూరుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) నక్సల్స్ రహిత భారత్‌ను చూడాలనే టార్గెట్ పెట్టుకున్నారు. దీంతో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా దట్టమైన అటవీ ప్రాంతాల్లో భద్రతా దళాల కూంబింగ్ జరుగుతోంది.