లోక నాయకుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) తమిళనాడు రాష్ట్రం నుంచి పెద్దల సభ రాజ్యసభకు వెళ్లనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో అధికార డీఎంకేతో కుదిరిన ఒప్పందం ప్రకారం కమల్ పార్టీకి రాజ్యసభ స్థానం కేటాయించారు. తాజాగా ఆయనను ఎగువసభకు పంపిస్తున్నట్లు డీఎంకే-ఎంఎన్‌ఎం అధికారికంగా ప్రకటించాయి.
ఇక కమల్ సినిమా విషయానికొస్తే దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’ చిత్రంలో నటించారు. 36 ఏళ్ల తరువాత కమల్-మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా తెరపైకి రావడం విశేషం. ఈ సినిమా రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. కథానాయికగా త్రిష కనిపించనుండగా, శింబు జోజు జార్జ్, గౌతమ్ కార్తీక్, ఐశ్వర్య లక్ష్మి వంటి ప్రతిభావంతులైన నటులు కీలక పాత్రల్లో అలరించనున్నారు. జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది.