హనుమంతుడిలా బీజేపీ అవినీతిపై పోరాడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ ఫౌండేషన్ డే సందర్భంగా ప్రసంగించిన మోడీ హనుమజ్జయంతి సందర్భంగా ఈ సందేశం ఇచ్చారు. అవినీతి, బంధుప్రీతిపై పోరాడుతూ, దేశంలో శాంతి భద్రతలను కాపాడేందుకు తమ ప్రభుత్వం పలు సవాళ్లపై పోరాటం చేస్తోందన్నారు మోడీ. ఆంజనేయుడి నుంచి తాము పోరాట పటిమను స్ఫూర్తిగా పొందినట్టు మోడీ చెప్పుకొచ్చారు.
దేశంలోని పార్టీ కార్యకర్తలందరిని వెబ్ కాస్ట్ ద్వారా కలుసుకున్న ఆయన ..సాధిద్దాం అనే దృఢ సంకల్పంతో మొక్కవోని దీక్షతో హనుమంతుని సందేశాన్ని తాము తూ.చ. పాటిస్తూ ఇందుకు కఠినాతి కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకాడట్లేదని మోడీ ప్రకటించారు. పార్టీ కోసం శ్రమిస్తూ, త్యాగాలు చేస్తున్న కార్యకర్తలను ఆయన ప్రశంసించారు. నేషన్ ఫస్ట్ అనే పాలసీ అమలులో మేం రాజీ పడమంటూ మోడీ వెల్లడిస్తూ తమ సర్కారు సాధించిన విజయాలను ఏకరువు పెట్టారు.
సబ్కా హాథ్, సబ్కా సాథ్, సబ్కా ప్రయాస్ తో తాము దేశాభివృద్ధిని సాధిస్తామన్నారు.