Nagaland Governor La Ganesan Dies: నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్ (80) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కొహిమా రాజ్ భవన్ వర్గాలు ధృవీకరించాయి.
గత కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారని రాజ్ భవన్ పీఆర్‌ఓ తెలిపారు. ఆగస్టు 8న చెన్నైలోని తన నివాసంలో లా గణేశన్ కళ్లు తిరిగి పడిపోవడంతో తలకు గాయమైంది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ వచ్చారు.
లా గణేశన్ 2023 ఫిబ్రవరి 12న నాగాలాండ్‌కు 21వ గవర్నర్‌గా నియమితులయ్యారు. అదే ఏడాది ఫిబ్రవరి 20న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన అనేక కీలక పదవులను నిర్వహించారు. తమిళనాడులో బీజేపీ సీనియర్ నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.
ఆయన మరణం పట్ల రాజకీయ ప్రముఖులు, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. నాగాలాండ్ రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. లా గణేశన్ అంత్యక్రియలు శనివారం చెన్నైలో జరగనున్నట్లు సమాచారం.


