Nepal PM: హిందువులు శ్రీరాముడి జన్మస్థలంగా భావించే అయోధ్యపై నేపాల్ దేశ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. శ్రీ రాముడు భారత్‌లోని అయోధ్యలో పుట్టలేదని.. తమ దేశమైన నేపాల్‌లో పుట్టారని మరోసారి పునరుద్ఘాటించారు. ఆ దేశ రాజధాని ఖాట్మండులో జరిగిన ఓ కార్యక్రమంలో అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయోధ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపాల్ ప్రధానమంత్రి కేపీ ఓలీ ఏమన్నారంటే..”నేను నా సొంతంగా మాటలు చెప్పడం లేదు. వాల్మీకి రాసిన అసలైన రామాయణం ఆధారంగానే ఈ విషయం చెబుతున్నాను. రాముడు జన్మించిన ప్రదేశం నేపాల్ లోనే ఉంది. ఈ నిజాన్ని ప్రచారం చేసేందుకు మీరంతా (ప్రజలు) ఏ మాత్రం వెనుకాడొద్ద”ని ఆయన పిలుపునిచ్చారు.
పాత పాటే పాడుతూ..
సరిగ్గా ఐదేళ్ల క్రితం అంటే 2020లో కూడా నేపాల్ ప్రధాని కేపీ ఓలీ ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తమ దేశంలోని చిత్వాన్ జిల్లా థోరి ప్రాంతమే అసలైన అయోధ్య అని ఆయన ప్రకటించుకున్నారు. అక్కడే శ్రీరాముడు జన్మించాడని పేర్కొన్నారు.
ఆ శ్రీరాముడే కాకుండా.. హిందూ దేవుడైన ఆ పరమ శివుడు, విశ్వామిత్రుడు కూడా నేపాల్ లోనే జన్మించినట్లు నేపాల్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశాడు. భారతీయ ఇతిహాసాల్లో పేర్కొన్న ఎన్నో ప్రదేశాలు ప్రస్తుతం నేపాల్‌లోని సున్‌సారి జిల్లాలో ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.


