Friday, February 21, 2025
Homeనేషనల్Delhi Railway: ఢిల్లీ తొక్కిసలాట.. బాధితులకు ప్రభుత్వ పరిహారం

Delhi Railway: ఢిల్లీ తొక్కిసలాట.. బాధితులకు ప్రభుత్వ పరిహారం

న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో శనివారం జరిగిన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో 13 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇక ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు, గాయపడిన బాధితులకు భారతీయ రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2.5 లక్షలు, స్వల్ప గాయాలకు గురైనవారికి రూ. 1 లక్ష చొప్పున నష్టపరిహారం అందజేస్తామని రైల్వే శాఖ తెలిపింది.

- Advertisement -

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ప్రయాగరాజ్ మహాకుంభ 2025 మేళాకు వెళ్తున్న వేలాది మంది భక్తులు శనివారం వచ్చారు. ఈ క్రమంలో ప్రయాగరాజ్ స్పెషల్ రైలు 12వ ప్లాట్‌ఫాం నుండి 16వ ప్లాట్‌ఫాం కు మార్చడంతో ఆ ప్రాంతంలో మరింత గందరగోళం నెలకొంది. ప్లాట్‌ఫాం 12 వద్ద వేచివున్నవారు, బయట ఉన్నవారు ఒక్కసారిగా 16వ ప్లాట్‌ఫాం వైపు వెళ్లారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పలువురు కిందపడి ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయాలపాలయ్యారు.

ఈ ఘటనపై రైల్వే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పందించారు. భక్తుల రద్దీని అంచనా వేశామని, కానీ కేవలం 10 నిమిషాల్లోనే ఘోరం జరిగిందని తెలిపారు. రైలు ఆలస్యం కావడం, ప్రయాణికుల అధిక సంఖ్య వల్ల ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చారు. దీనిపై దర్యాప్తుకు కమిటీని ఏర్పాటు చేశామని రైల్వే బోర్డు తెలిపింది. తొక్కిసలాట తర్వాత నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులను తరలించారు.

ప్రధాని మోదీ దిగ్ర్భాంతి: ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. బాధితులందరికీ అన్ని రకాల సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

రాహుల్ గాంధీ స్పందన: తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందని ట్వీట్ చేశారు. మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని తెలిసి కూడా స్టేషన్‌లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News