Saturday, November 15, 2025
Homeనేషనల్Visakhapatnam: విశాఖ జోన్‌ రైలు జోరు.. నెలలో నోటిఫికేషన్ - సంక్రాంతికి అపాయింటెడ్‌ డే!

Visakhapatnam: విశాఖ జోన్‌ రైలు జోరు.. నెలలో నోటిఫికేషన్ – సంక్రాంతికి అపాయింటెడ్‌ డే!

Visakhapatnam Railway Zone: దశాబ్దాల నాటి కల సాకారమయ్యే దిశగా విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ (SCoR) ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది. రైల్వే బోర్డు కీలక నియామకాలతో జోన్ ఏర్పాటుపై తన చిత్తశుద్ధిని చాటుతుండగా, నెల రోజుల్లోనే అధికారిక నోటిఫికేషన్ వెలువడనుందని విశ్వసనీయ వర్గాలు దృఢంగా చెబుతున్నాయి. ఈ పరిణామాలతో కొత్త జోన్ కార్యకలాపాలు ఎప్పటినుంచి ప్రారంభమవుతాయి..? ఆ కీలకమైన ‘అపాయింటెడ్‌ డే’ ఎప్పుడు..? పునర్విభజన తర్వాత జరిగే మార్పులేంటి..? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

- Advertisement -

నియామకాల జోరు.. ప్రక్రియ వేగవంతం : విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జోన్‌కు రైల్వే బోర్డు ఉన్నతాధికారుల నియామకాల పర్వాన్ని వేగవంతం చేసింది. జూన్‌లో జనరల్ మేనేజర్‌గా (జీఎం) సందీప్ మాథుర్‌ను నియమించిన బోర్డు, తాజాగా ఆగస్టు 6న ప్రిన్సిపల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా ఏపీ శర్మను, కొద్ది రోజుల క్రితం ఇంజినీరింగ్ విభాగానికి అమిత్ గుప్తాను నియమించింది. కీలకమైన ఫైనాన్స్ విభాగానికి తూర్పుకోస్తా జోన్‌కు చెందిన ఓ అధికారికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆపరేషన్స్, కమర్షియల్, భద్రత, ఆర్పీఎఫ్ వంటి మిగతా కీలక విభాగాలకు సైతం ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (పీహెచ్‌ఓడీ) నియామకాలు త్వరలోనే పూర్తికానున్నాయని సమాచారం.

నెల రోజుల్లో నోటిఫికేషన్.. 3 నెలల్లో ‘అపాయింటెడ్‌ డే’ : పీహెచ్‌ఓడీల నియామకాల ప్రక్రియ పూర్తి కాగానే, దక్షిణ మధ్య రైల్వే పునర్విభజన, దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటుపై అధికారిక నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రావొచ్చని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగు నెలల వ్యవధిలో ‘అపాయింటెడ్‌ డే’ను ప్రకటిస్తారని, ఆ రోజు నుంచి దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా జోన్‌ల కార్యకలాపాలు స్వతంత్రంగా ప్రారంభమవుతాయని ఒక ఉన్నతాధికారి వెల్లడించారు.దీనితో వచ్చే డిసెంబరు లేదా జనవరి (సంక్రాంతి) నాటికి కొత్త జోన్ కార్యరూపం దాల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు.

విభజన తర్వాత స్వరూపం ఇలా..
కొత్త జోన్ నిర్మాణం: దక్షిణ మధ్య రైల్వే (ద.మ.రైల్వే) లోని మూడు డివిజన్లు, తూర్పుకోస్తా జోన్‌లోని కొంత భాగంతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ (SCoR) ఏర్పడుతుంది. దీని తర్వాత ద.మ.రైల్వే పరిధిలో డివిజన్ల సంఖ్య ఆరు నుంచి మూడుకు పరిమితమవుతుంది.

సికింద్రాబాద్ డివిజన్‌కు ప్రయోజనం: రాయచూర్-వాడి సెక్షన్ (108 కి.మీ.): ప్రస్తుతం గుంతకల్లు డివిజన్‌లో ఉన్న ఈ మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్‌కు బదిలీ చేస్తారు. దీనివల్ల కర్ణాటక నుంచి సికింద్రాబాద్ వచ్చే రైళ్లకు జోన్ ఇంటర్‌ఛేంజ్ పాయింట్లు రెండు నుంచి ఒకటికి తగ్గి, యడ్లాపూర్, యెమరాస్‌లోని థర్మల్ ప్లాంట్లకు బొగ్గు రవాణా సులభతరం అవుతుంది.

విష్ణుపురం-పగిడిపల్లి/జాన్‌పహాడ్ (142 కి.మీ.): ప్రస్తుతం గుంటూరు డివిజన్‌లో ఉన్న ఈ సెక్షన్లు కూడా సికింద్రాబాద్ డివిజన్‌లోకి మారతాయి. ఇది సింగరేణి నుంచి బొగ్గు రవాణాకు అంతరాయాలు తొలగిస్తుంది.

విజయవాడ డివిజన్‌కు బదిలీ: కొండపల్లి-మోటుమర్రి (46 కి.మీ.): సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఈ సెక్షన్‌ను విజయవాడ డివిజన్‌కు బదిలీ చేస్తారు.కొండపల్లిలోని నార్ల తాతారావు పవర్‌ప్లాంట్‌కు బొగ్గు రవాణా మరింత సులభతరం కానుంది.

రద్దయిన ప్రాజెక్టు: దాదాపు పాతికేళ్ల కిందట సర్వే జరిపి, దశాబ్దం క్రితం మంజూరైన పాండురంగాపురం-భద్రాచలం రైలు ప్రాజెక్టును రైల్వే శాఖ రద్దు చేసింది. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు కొత్త లైన్ మంజూరైన నేపథ్యంలో పాత ప్రాజెక్టు అవసరం లేదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad