ఓడిశాలో రైలు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గువాహటి వెళ్తున్న కామాఖ్యా ఎక్స్‌ప్రెస్ (12251) రైలు 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన కటక్ సమీపంలోని నేరగుండి స్టేషన్ (ఖుర్దా డివిజన్) వద్ద రాత్రి 11.54 గంటలకు జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, ఎవరూ గాయపడలేదని ఈస్ట్ కోస్ట్ రైల్వే సీపీఆర్‌ఓ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. ప్రమాదానికి గురైన బోగీలు అన్నీ ఏసీ కోచ్‌లని అధికారులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు కొన్ని రైళ్ల రూట్లు మార్చినట్లు అధికారులు ప్రకటించారు. ప్రయాణికుల కోసం హెల్ప్‌లైన్ నంబర్ 8991124238 అందుబాటులో ఉంచారు. గతంలో కూడా ఓడిశాలో అనేక రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
2023లో జరిగిన భయానక రైలు ప్రమాదంలో 296 మంది మరణించగా, 1,200 మందికి పైగా గాయపడ్డారు. అలాగే, 2022లో కోరాయి రైల్వే స్టేషన్ వద్ద ఓ మాల్గాడి పట్టాలు తప్పి స్టేషన్ భవనాన్ని ఢీకొనడంతో రెండు మంది మృతిచెందారు. తాజా ప్రమాదానికి గల కారణాన్ని గుర్తించేందుకు రైల్వే శాఖ దర్యాప్తు ప్రారంభించింది. సహాయ బృందాలు, అత్యవసర వైద్య సేవలు ఘటనాస్థలంలో అందుబాటులోకి తెచ్చారు.