తన జీవితాంతం యాచించగా వచ్చిన డబ్బును ఓ 70 సంవత్సరాల మహిళ ఒక ఆలయానికి విరాళంగా ఇచ్చేసింది. ఆ మహిళ పేరు తుల బెహెర. ఆమె భర్త ప్రఫుల్లాకి అంగవైకల్యం కారణంగా యాచించడం తప్ప బ్రతుకుదెరువుకి మరోదారి కనిపించలేదు. 40 ఏళ్లుగా ఫుల్బానికి సమీపంలోని పట్టణంలో ఇద్దరూ యాచిస్తూ జీవితం సాగిస్తున్నారు. కొంతకాలం క్రితం ఆమె భర్త మరణించాడు. వాళ్లిద్దరూ.. ఒకరికొకరు తప్ప మరో తోడు లేదు.
భర్త తప్ప తన అనుకునేవారెవరూ లేకపోవడంతో తుల తన సంపాదనంతా జగన్నాథుడి ఆలయానికి విరాళంగా ఇచ్చేసింది.
ఒడిశాలోని కందమాల్ జిల్లాలో ఫుల్బాని అనే గ్రామంలో జగన్నాథుడి ఆలయం ఉంది. ఆ గుడికే తన సొత్తు మొత్తాన్ని అందించింది. శుక్రవారం ధాను సంక్రాంతి అనే వేడుక జరిగింది. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న లక్ష రూపాయలను జగన్నాథుడికి విరాళంగా ఇచ్చింది. గుడి యాజమన్య కమిటీ ఆ డబ్బును తీసుకున్నారు. తొలుత ఆమె డబ్బును తీసుకునేందుకు ఆలయ కమిటీ నిరాకరించింది. కానీ.. ఆమె ఆ డబ్బు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టడంతో తీసుకోక తప్పలేదని కమిటీ సభ్యుడు పేర్కొన్నాడు.
ఈ విషయమై తుల స్పందిస్తూ ‘‘చాలా కాలంగా యాచించిన డబ్బును బ్యాంకులో దాచుకున్నాను. నాకు పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరు. ఆ డబ్బుతో నేనేం చేసుకోవాలి? అందుకే ఆ జగన్నాథుడికే దానం చేశాను’’ అని చెప్పింది. వృద్ధాప్యంలో జగన్నాథుడికి అంకితమైపోవాలనుకున్న తనకు ఇక డబ్బుతో పనిలేదని చెప్పుకొచ్చింది. ఆలయ పునరుద్ధరణకు ఈ డబ్బును వినియోగించాలని ఆలయ నిర్వాహక కమిటీని ఆమె అభ్యర్థించింది.