జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి(Pahalgam Attack) యావత్ భారత్‌తో పాటు ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అప్పటివరకు తమతో సరదాగా గడిపిన కుటుంబసభ్యులు కళ్ల ముందే మతోన్మాద తూటాలకు బలికావడం షాక్‌కు గురిచేసింది. ఆ దయనీయ దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. పహల్గాం సమీపంలోని బైసరన్ మైదానంలో జరిగిన దాడిలో 25 మంది పర్యాటకులు, స్థానిక గైడ్ ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తోయిబా షాడో సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ఈ మారణహోమానికి పాల్పడినట్టు తెలిపింది. ఈ ఉగ్రదాడి జరిగి నేటికీ సరిగ్గా నెల రోజులు పూర్తయింది.
ఈ దాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) పేరుతో పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఇందులో 100 మంది ఉగ్రవాదులు మరణించడంతో పాటు వారి స్థావరాలు చెల్లాచెదురయ్యాయి. ముఖ్యంగా లష్కరే తోయిబా చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మహ్మద్ అజార్ కుటుంబసభ్యులు ప్రాణాలు కోల్పోయారు. అలాగే పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంను పూర్తి ధ్వంసమయ్యాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు ప్రాంతాల్లో భారత భూభాగంపైకి పాక్ వదిలిన డ్రోన్లు, క్షిపణులను భారత ఆర్మీ బలంగా తిప్పికొట్టింది. భారత్-పాక్ శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికాతో పాటు జీ7 దేశాలు విజ్ఞప్తి చేయడంతో కాల్పుల విరమణ జరిగింది.