పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) దాయాది దేశాన్ని వణికిస్తోంది. బవహల్పూర్‌లోని జైషే-మహ్మద్, మురిద్కే కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబా క్యాంపులపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో దాదాపు 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఈ దాడుల్లో జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్(Masood Azhar) ఇల్లు పూర్తిగా నేలమట్టమైంది. మసూద్ ఇంటితో పాటు ఉగ్రవాదుల ట్రైనింగ్ క్యాంప్‌పై మిస్సైల్ దాడి జరిగింది.
ఈ ఘటనలో మసూద్ కుటుంబసభ్యులు 10 మందితో పాటు అతడి సోదరి, బావమరిది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. కానీ మృతుల్లో మసూద్ ఉన్నాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. కాగా భారత ఆర్మీ చేపట్టిన దాడుల్లో మసూద్ అజార్ స్థావరం కూడా ఉన్నట్లు పాక్ పౌరులు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.