దేశమంతటిదీ ఒక దారైతే, ఒడిశాది మాత్రం మరో దారి. ఒడిశా పాలక బిజూ జనతా దళ్ (బిజెడి) నాయకత్వానికి, ప్రతిపక్ష బీజేపీ నాయకత్వానికి మధ్య అవినాభావ సంబంధమే ఉన్నప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో మాత్రం అవి రెండూ విడివిడిగా పోటీ చేయాలనే నిర్ణయించుకున్నాయి. దీంతో దాదాపు రెండు వారాల నుంచి ఈ రెండు పార్టీల కార్యకర్తల్లో ఉన్న సందేహాలు, గుంజాటనలు తొలగిపోయి, ఒక విధమైన ప్రశాంత వాతావరణం ఏర్పడింది. పొత్తుకు సంబంధించి తమ రెండు పార్టీల మధ్య గత కొద్ది కాలంగా జరుగుతున్న చర్చలు విఫలం కావడంతో తాము ఎవరికి వారుగా పోటీ చేయబోతున్నామని ఉభయ పార్టీల నాయకులు ప్రకటించడంతో కార్యకర్తలంతా ఊపిరి పీల్చుకున్నారు. అనేక కారణాల వల్ల ఈ రెండు పార్టీల మధ్యా పొత్తు కుదరలేదు.
మొత్తం 147 స్థానాల ఒడిశా శాసనసభల్లో ఎక్కువ స్థానాలు బీజేపీకి ఇవ్వడానికి బీజేడీ సుముఖంగా లేదు. 2019 శాసనసభ ఎన్నికల్లో ఈ పార్టీ 112 స్థానాలు చేజి క్కించుకోగలిగింది. అప్పట్లో బీజేపీ సంపాదించుకున్న సీట్ల సంఖ్య 23 మాత్రమే. ఇక 2022లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ భారీ మెజారిటీలు సంపాదించింది. మొత్తం 852 జిల్లా పరిషత్ స్థానాల్లో బీజేడీ 766 స్థానాలను చేజిక్కించుకోగలిగింది. కేవలం 42 స్థానాలతో బీజేపీ రెండవ స్థానంలో నిలబడింది. ఒడిశాలో బీజేపీతో చేతులు కలిపి మరిన్ని లోక్ సభ స్థానాలను సంపాదించాలని బీజేపీ మొదట్లో భావించినప్పటికీ, ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకుని ఒంటరిగానే పోటీ చేయడం మంచిదనే నిర్ణయానికి వచ్చింది. ఏవో కొన్ని శాసనసభ స్థానాలకు మాత్రమే పోటీ చేయడం వల్ల రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ దెబ్బతినే అవకాశం ఉందని స్థానిక బీజేపీ నాయకులు చెప్పడంతో అధిష్ఠానం కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించింది.
మారిపోతున్న బంధాలు
అంతేకాక, తమ రెండు పార్టీలు ఎన్నికలకు ముందు చేతులు కలిపే పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎన్నికలకు ముందే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించే ప్రమాదం ఉందని ఈ రెండు పార్టీల అగ్ర నాయకత్వాలు భావించాయి. ఒడిశాలో కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతం రానురానూ తగ్గుముఖం పడుతోంది. ఈ దశలో కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు సమ కూర్చే పనేదీ తాము చేయకూడదని కూడా ఈ రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలతలు పెరగడానికి, అవకాశాలు ఏర్పడడానికి బీజేపీ ఏమాత్రం సుముఖంగా లేదు. ఇక 2009లో ఈ రెండు పార్టీలు తెగతెంపులు చేసుకున్న దగ్గర నుంచి ఈ పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు కారాలు, మిరియాలు నూరడం కొనసాగుతూనే ఉంది. కార్యకర్తల మధ్య సయోధ్య లేనప్పుడు, కార్యకర్తలకు నచ్చనప్పుడు తాము పొత్తు కుదర్చుకోవడం వల్ల ఆశించిన ఫలితం ఉండకపోవచ్చని కూడా ఈ పార్టీలు అర్థం చేసుకున్నాయి. తాము బలవంతంగా పొత్తు కుదర్చుకునే పక్షంలో పలువురు నాయకులు, క్రియాశీల కార్యకర్తలు పార్టీల నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉందని ఈ పార్టీలు గ్రహించాయి.
కార్యకర్తల స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య, సఖ్యత లేనప్పటికీ, అగ్ర స్థాయిలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య అవినాభావ సంబంధం ఉంది. అగ్ర నాయకులు మాత్రం ఎప్పుడూ ఎక్కడా ఏ సందర్భంలోనూ ఘర్షణకు దిగిన పాపాన పోలేదు సరికదా, ఎంతో అన్యోన్యంగా వ్యవహరించడం కూడా జరుగుతూ వస్తోంది. నవీన్ పట్నాయక్ తమకు రహస్య మిత్రుడని బీజేపీ నాయకులు తరచూ వ్యాఖ్యా
నించడం కూడా జరుగుతుంటుంది. విచిత్రమేమిటంటే, 2019లో కూడా ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడమే కాకుండా, కనీ వినీ ఎరుగని విధంగా విమర్శలు, ప్రతి విమర్శలు సాగించాయి. 2019 ఎన్నికల తర్వాత నుంచి బీజేజీ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోదీ చేపడుతున్న పథకాలను, విధానాలను సమర్థిస్తూనే వస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం సాధిస్తున్న ఆర్థికాభివృద్ధిని వీలైనప్పుడల్లా, సందర్భం వచ్చినప్పుడల్లా ప్రశంసిస్తూనే ఉంది.
సరికొత్త స్నేహాలు
రాష్ట్రంలో రెండు పర్యాయాలు పర్యటించిన మోదీ బీజేడీ ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ప్రశంసించడమే కాకుండా, నవీన్ పట్నాయక్ తనకు మిత్రుడని, సమర్థుడైన పాలకుడని పొగడ్తలతో ముంచెత్తడం జరిగింది. ఇటీవల ఒడిశా నుంచి రాజ్యసభకు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి అశ్వినీ వైష్ణవ్ కు బీజేడీ ప్రభుత్వం అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించింది. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా విడివిడిగానే పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. అంతేకాక, కేవలం మోదీ నాయకత్వాన్నే కేంద్రంగా చేసుకుని ఒడిశాలో ఎన్నికల ప్రచారం జరపాలని రాష్ట్ర బీజేపీ భావిస్తోంది. పేదలు, ఆదివాసీల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలను ఒడిశాలో సరిగ్గా అమలు చేయడం లేదని, ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడే పక్షంలో కేంద్ర పథకాలు పూర్తి స్థాయిలో అమలు జరగడానికి అవకాశం ఉంటుందని బీజేపీ ఇక్కడ ప్రచారం చేస్తోంది. నవీన్ పట్నాయక్ గత అయిదు పర్యాయాల నుంచి ఒడిశాలో ముఖ్యమంత్రిగా ఉంటున్నారు. తాము ఈసారి కూడా భారీ మెజారిటీ సాధించి అధికారంలోకి రావడం జరుగుతుందని, రాష్ట్రాల సమాఖ్య స్ఫూర్తికి తగ్గట్టుగా, జాతీయవాదానికి అనుకూలంగా పరిపాలన సాగించడం జరుగుతుందని బీజేడీ ప్రచారం సాగిస్తోంది.
ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేడీ సహకారం బీజేపీకి అవసరమైన పక్షంలో అవసర సహకారాన్ని అందించడానికి బీజేడీ సిద్ధంగా ఉంది. ఒకవేళ బీజేపీ నాయకత్వంలోని ఎన్.డి.ఏకి పూర్తి మెజారిటీ రాని పక్షంలో తమ వంతు సహాయం అందజేయడానికి కూడా బీజేడీ సుముఖంగా ఉంది. బీజేపీతో తెగతెంపులు చేసుకోవడానికి బీజేడీ ఏమాత్రం ఇష్టపడడం లేదు. కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరపడానికి, రాష్ట్రాన్ని కేంద్ర సహాయంతో అభివృద్ధి చేయడానికి నవీన్ పట్నాయక్ కు ఏమాత్రం అభ్యంతరం లేదు. ఈ రెండు పార్టీల మధ్యా ఈ విధంగా స్నేహ సంబంధాలు కొనసాగుతుండగా, ఒడిశాలో రెండవ స్థానం సంపాదించడానికి కాంగ్రెస్ తీవ్రంగా కృషి చేస్తోంది. నిజానికి ఇప్పటి వరకూ రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీన స్థితిలోనే ఉంది. బీజేపీ, బీజేడీల స్నేహ పూర్వక పోటీల ద్వారా లబ్ధి పొందాలని కాంగ్రెస్ గతంలో కూడా ప్రయత్నించింది కానీ అది సాధ్యం కాలేదు.
– జి. రాజశుక