పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి భారత్ కఠినంగా స్పందించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం అత్యవసరంగా భద్రతా కేబినెట్ కమిటీ (CCS) సమావేశాన్ని నిర్వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌పై వ్యూహాత్మకంగా ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ 1960లో రెండు దేశాల మధ్య కుదిరిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది పాకిస్తాన్‌కు దెబ్బతీసే నిర్ణయం కానుంది. అంతేగాక అటారీ-వాఘా సరిహద్దును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు విదేశాంగ కార్యదర్శి ప్రకటించారు.
దౌత్య రంగంలోనూ భారత్ గణనీయమైన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్తాన్‌తో అన్ని దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్లు ప్రకటిస్తూ, భారత్‌లో ఉన్న పాక్ పౌరులు 48 గంటల లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇప్పటికే వారి కోసం జారీ చేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు కూడా పేర్కొంది. ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో సిబ్బందిని 55 నుంచి 30కి తగ్గించాలని భారత్ నిర్ణయించింది. అంతేకాక ఆ కార్యాలయంలో ఉన్న సైనిక సలహాదారులు తక్షణం భారత్‌ను విడిచి వెళ్లాలని సూచించింది.
ఈ నిర్ణయాలన్నీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై దృష్టి పెట్టినవిగా భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశ భద్రత కోసం అవసరమయ్యే ప్రతి చర్య తీసుకుంటామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. పహల్గామ్ దాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రాగా.. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ నిర్ణయాలు ప్రకటించింది.