జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) ఎట్టకేలకు స్పందించారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ భారత ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై షరీఫ్ పరోక్షంగా స్పందించారు. ఎలాంటి ముప్పును ఎదుర్కోడానికైనా తాము సంసిద్ధంగా ఉన్నామని తెలిపారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేత అంశంపై ప్రస్తావిస్తూ.. భారత్ ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ దాడి వెనక ఎవరున్నారో అంతర్జాయంగా నిరూపించాలని డిమాండ్ చేశారు.
కాగా ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక పాక్ కేంద్రంగా పనిచేస్తోన్న లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్ ఫోర్స్’ హస్తం ఉన్నట్లు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు భారత్ గట్టి షాకిచ్చింది. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అటు పాక్ కూడా ప్రతిచర్యలు చేపట్టింది.