Thursday, May 15, 2025
Homeనేషనల్ఏప్రిల్ 27 తర్వాత భారత్‌లో పాక్ పౌరులు ఉంటే.. ఆ శిక్షలు తప్పవు..!

ఏప్రిల్ 27 తర్వాత భారత్‌లో పాక్ పౌరులు ఉంటే.. ఆ శిక్షలు తప్పవు..!

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ లో.. పాకిస్తాన్ పౌరుల వీసా సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 27 నుంచి పాక్ పౌరులకు మంజూరైన వీసాలు రద్దు కానున్నాయి. మెడికల్ వీసాలకు మాత్రం కొంత ఆలస్యం ఉంది. అవి ఏప్రిల్ 29 వరకు చెల్లుబాటు అయ్యేలా కొనసాగనున్నాయి. ఈ గడువుల్లోగా పాక్ జాతీయులు భారత్ విడిచిపెట్టి వెళ్లిపోవాలి. లేకపోతే చట్టపరమైన తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

- Advertisement -

వీసా గడువు ముగిసిన తర్వాత భారతదేశంలో ఉండటం చట్టవిరుద్ధం. ఫారినర్స్ యాక్ట్, 1946 ప్రకారం ఇది నేరంగా పరిగణిస్తారు. అలాగే అక్రమ వలసదారులుగా గుర్తింపు పొంది, అరెస్ట్‌కి గురయ్యే ప్రమాదం ఉంటుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని, డిటెన్షన్ సెంటర్‌లకు తరలించవచ్చు. అక్కడ నుంచి తదుపరి చర్యల కోసం ఉంచుతారు. డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా వారిని స్వదేశానికి పంపించే చర్యలు చేపడతారు.

ఓవర్‌స్టే చేసినందుకు జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, వీసా నిబంధనల ఉల్లంఘనపై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఫారినర్స్ యాక్ట్ 1946, రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫారినర్స్ యాక్ట్ 1939, తాజా ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ బిల్ 2025 ప్రకారం శిక్షలు వర్తిస్తాయి. వీసా గడువుకు మించి భారత్‌లో ఉంటే, 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. కొత్త బిల్లులో అయితే మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.3 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. ఫోర్జరీ డాక్యుమెంట్లను వాడిన కేసులో మరింత కఠినంగా 2 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష, రూ.1 నుండి రూ.10 లక్షల వరకు జరిమానా విధించనున్నారు.

భవిష్యత్తులో భారత్‌లోకి ప్రవేశం నిషేధించబడే అవకాశమూ ఉంది. ఒకసారి ఓవర్‌స్టే చేసిన పాక్ జాతీయులు మళ్లీ భారతదేశానికి రావడానికి అనుమతి లభించకపోవచ్చు. ఇది తాత్కాలికంగా ఉండొచ్చు, లేదా శాశ్వతంగా నిషేధించబడే అవకాశం ఉంది. ఇక మెడికల్ వీసాల విషయంలో ప్రత్యేకంగా పాక్ దేశీయులకు ఏప్రిల్ 29 వరకు గడువు ఇచ్చారు. ఆ తర్వాత కూడా వారు భారత్‌లో ఉంటే, పై పేర్కొన్న చట్టపరమైన చర్యలు తప్పవు. చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లడం మంచిది. అవసరమైతే ఇమ్మిగ్రేషన్ నిపుణుల సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News