Monday, November 17, 2025
Homeనేషనల్Parliament Food: కొత్త మెనూతో పార్లమెంట్ క్యాంటీన్.. ఎంపీలకు ఇకపై పసందైన విందు!

Parliament Food: కొత్త మెనూతో పార్లమెంట్ క్యాంటీన్.. ఎంపీలకు ఇకపై పసందైన విందు!

Parliament Canteen New Menu: చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు ఏం తింటారు..? వారి ప్లేట్‌లోకి ఎలాంటి ఆహారం వస్తుంది..? ఈ ప్రశ్న చాలామందికి ఆసక్తి కలిగిస్తుంది. అయితే ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశాల వేళ, ఆ ప్లేట్ల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. సంప్రదాయ వంటకాలకు ఆధునిక ఆరోగ్య సూత్రాలను జోడించి, సరికొత్త మెనూతో క్యాంటీన్ సిద్ధమైంది. రాగి ఇడ్లీలు, జొన్న ఉప్మాలతో పాటు నోరూరించే ఎన్నో వెరైటీలు ఎంపీలకు స్వాగతం పలకనున్నాయి. అసలు ఈ మార్పుల వెనుక ఉన్న కారణాలేంటి..? కొత్త మెనూలో ఇంకేమేం ప్రత్యేకతలున్నాయి..? 

వచ్చే సోమవారం, జులై 21 నుంచి ప్రారంభమై ఆగస్టు 12 వరకు జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈ సమావేశాల సందర్భంగా ఎంపీలకు రుచికరమైన, పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇచ్చిన సూచనల మేరకు, పార్లమెంట్ క్యాంటీన్ కొత్త మెనూను రూపొందించింది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ, పాత రుచులకు కొత్త హంగులు అద్దింది.

- Advertisement -

ఆరోగ్యమే మహాభాగ్యం.. మెనూలో మార్పులివీ:

ప్రజా ప్రతినిధుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈసారి మెనూలో కీలక మార్పులు చేశారు. ప్రతి వంటకంలో కార్బోహైడ్రేట్లు, సోడియం, కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాదు, ప్రతి వంటకం పక్కన దానిలోని కేలరీల వివరాలను కూడా ప్రదర్శించనున్నారు.

చిరుధాన్యాలతో చిరునవ్వులు:

కొత్తగా ప్రవేశపెట్టిన వంటకాల్లో చిరుధాన్యాలకు పెద్దపీట వేశారు. రాగి మిల్లెట్ ఇడ్లీ – సాంబార్, చట్నీ (270 కిలో కేలరీలు), జొన్న ఉప్మా (206 కిలో కేలరీలు), చక్కెర కలపని మిక్స్డ్ మిల్లెట్ ఖీర్ (161 కిలో కేలరీలు) వంటివి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.

శాకాహార ప్రియుల కోసం:

అందరికీ ఇష్టమైన పెసర పప్పు దోశ, చనా చాట్‌లతో పాటు, బార్లీ-జొన్న సలాడ్ (294 కిలో కేలరీలు), గార్డెన్ ఫ్రెష్ సలాడ్ (113 కిలో కేలరీలు) వంటివి అందిస్తారు. టమాటా బాసిల్ షోర్బా, వెజిటబుల్ క్లియర్ సూప్ వంటివి కూడా అందుబాటులో ఉంటాయి.

మాంసాహారుల కోసం ప్రత్యేకంగా:

మాంసాహారుల కోసం ఉడికించిన కూరగాయలతో వడ్డించే గ్రిల్డ్ చికెన్ (157 కిలో కేలరీలు), గ్రిల్డ్ చేపల వేపుడు (378 కిలో కేలరీలు) సిద్ధం చేశారు.

ప్రత్యేక పానీయాలు:

గ్రీన్ టీ, హెర్బల్ టీలతో పాటు, బెల్లం ఫ్లేవర్‌తో కూడిన మ్యాంగో పన్నా, మసాలా సత్తు వంటి దేశీయ పానీయాలు కూడా మెనూలో చేర్చారు.

చట్టసభల్లో వాడివేడి చర్చకు సిద్ధమవుతున్న బిల్లులు:

ఈ సమావేశాల్లో ఆహారంతో పాటు, రాజకీయ వాతావరణం కూడా వేడెక్కనుంది. కేంద్ర ప్రభుత్వం 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. వీటిలో నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియో హెరిటేజ్ సైట్స్ బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు, నేషనల్ యాంటీ డోపింగ్ సవరణ బిల్లు వంటి కీలకమైనవి ఉన్నాయి. వీటితో పాటు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన పొడిగింపుపై కూడా పార్లమెంటు ఆమోదం కోరనుంది.

ప్రతిపక్షాల అస్త్రాలు:

మరోవైపు, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా, త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. అలాగే, “ఆపరేషన్ సిందూర్” విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ఈ వర్షాకాల సమావేశాలు ఆహారపరంగానే కాక, రాజకీయంగానూ ఆసక్తికరంగా మారనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad