Petrol Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ భారీ ధరలతో బేజారైపోయిన సామాన్య ప్రజలకు భారీ ఊరట లభించే అవకాశం ఉంది. ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది. గతంలో భారీగా పెరిగిన ఈ ధరలు ఆ మధ్య కొద్దిగా తగ్గి ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. గత పదినెలలుగా అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు భారీగా తగ్గగా ఇంధన ధరలు కూడా స్వల్పంగా తగ్గుతూ వచ్చాయి.
అయితే, ఇప్పుడు రానున్న రోజుల్లో ఇవి మరింత తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో బ్రెంట్ ముడిచమురు ధర బ్యారెల్ కు 139.13 డాలర్లు ఉండగా.. ప్రస్తుతం 87.81 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. అంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 35 శాతం కంటే ఎక్కువగా తగ్గగా.. WTI క్రూడ్ ఆయిల్ ధర 38 శాతానికి పైగా తగ్గింది.
రానున్న రోజుల్లో ఇది 82 డాలర్లకు తగ్గే అవకాశం ఉందని ట్రెండ్ చూస్తే తెలుస్తుంది. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలలో దాదాపుగా రూ.5 పైనే తగ్గుదల కనిపించే ఛాన్స్ ఉంది. అమెరికాలో స్టాక్స్.. షెల్స్ పెరుగుదల, చైనాలో మరోసారి కోరలు చాస్తోన్న కోవిడ్, చమురు కోసం డ్రిల్లింగ్ పెంచుతామని యూకే ప్రధాని రిషి సునక్ ప్రకటన, డ్రిల్లింగ్ పెంచిన యూరప్‌లోని ఇతర దేశాలు కూడా ధరలు తగ్గేందుకు ఆస్కారం కనిపిస్తుంది.