Student-Made Organic Sanitary Pads: ఖరీదైన శానిటరీ ప్యాడ్లు కొనలేక, రుతుస్రావం సమయంలో పరిశుభ్రత పాటించలేక ఎందరో పేద మహిళలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఈ సమస్యను చూసి చలించిపోయిన ముగ్గురు ఫార్మసీ విద్యార్థినులు.. వారికి అండగా నిలిచారు. పర్యావరణానికి మేలు చేస్తూ, తిరిగి వాడగలిగే (రీయూజబుల్) సేంద్రియ (ఆర్గానిక్) ప్యాడ్లను సృష్టించి శెభాష్ అనిపించుకున్నారు. ప్రకృతి ప్రసాదించిన అరటి ఆకులు, సింగాడాల పొట్టుతో వారు చేసిన ఈ ఆవిష్కరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. మరి ఈ యువ మేధావులు ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపారు..?
ఒడిశాలోని బర్హంపుర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థినులు రేష్మారాణి సతపతి, అమృతా స్వైన్, స్నేహా గౌడ్.. చదువుతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థలో వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వారు నగరంలోని మురికివాడల్లో పర్యటించినప్పుడు, అక్కడి మహిళల ఆరోగ్య సమస్యలు వారిని తీవ్రంగా కలచివేశాయి.
క్షేత్రస్థాయిలో సమస్య గుర్తింపు: రుతుస్రావం సమయంలో చాలామంది మహిళలు ప్యాడ్లకు బదులుగా మామూలు గుడ్డ పీలికలను వాడుతున్నట్లు గుర్తించారు. దీనివల్ల ఇన్ఫెక్షన్లు, చర్మవ్యాధులు వస్తాయని వారికి అవగాహన కల్పించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/rahul-gandhi-caste-census-mistake-obc-rahul-gandhi-on-obcs/
ప్రభుత్వ ప్యాడ్లతో అసౌకర్యం: విద్యార్థినులు వారికి ప్రభుత్వ ప్యాడ్లను ఉచితంగా అందించినా, కొన్ని రోజుల తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ ప్యాడ్లు ఏమాత్రం సౌకర్యవంతంగా లేవని, వాటికంటే పాత గుడ్డలే నయమని మహిళలు చెప్పడంతో విద్యార్థినులు ఆశ్చర్యపోయారు.
పరిష్కారం కోసం పరిశోధన: సమస్యకు మూలం ఖరీదు మాత్రమే కాదు, సౌకర్యం కూడా అని గ్రహించిన ఈ త్రయం.. అందరికీ అందుబాటులో ఉండే, సౌకర్యవంతమైన, తిరిగి వాడగలిగే ప్యాడ్ల తయారీపై దృష్టి సారించారు.
అరటి ఆకులతో అద్భుతం : మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్లు, ఈ విద్యార్థినులకు ప్రకృతిలోనే పరిష్కారం దొరికింది.
ముడి పదార్థాలు: అరటి ఆకులు, నీటిలో పెరిగే సింగాడాల (వాటర్ చెస్ట్‌నట్) పొట్టు, ఓక్ కాయల పొట్టు, మృదువైన కాటన్ వస్త్రాన్ని ఎంచుకున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/fake-embassy-ghaziabad-harshvardhan-jain-links/
తయారీ విధానం: తొలుత అరటి ఆకుల నుంచి సహజసిద్ధమైన దారాన్ని (ఫైబర్) తీసి, దానిని శుభ్రంగా ఎండబెట్టారు. ఆ దారంతో కాటన్ వస్త్రాన్ని కలిపి ప్యాడ్ ఆకారంలో కుట్టారు.
కుషనింగ్ & శోషణ: ప్యాడ్ లోపల మెత్తదనం కోసం, ద్రవాన్ని పీల్చుకోవడం కోసం ఓక్ కాయల పొట్టు, సింగాడాల పొట్టును నింపారు.
ప్రత్యేకత: పూర్తిగా సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేయడం వల్ల ఇది చర్మానికి హాని చేయదు. వాడిన తర్వాత శుభ్రంగా ఉతికి ఎండలో ఆరబెడితే, దీనిని మళ్లీ మళ్లీ ఉపయోగించుకోవచ్చు.ఈ అద్భుత ఆవిష్కరణను విద్యార్థినులు ఐఐటీ భువనేశ్వర్‌లో ప్రదర్శించగా, వారిని ఒడిశా ఉప ముఖ్యమంత్రి ప్రవతి పరిదా ప్రత్యేకంగా అభినందించారు. “మహిళల సమస్యలను మహిళలే అర్థం చేసుకోగలరు” అని కొనియాడారు.
విద్యార్థినుల మాటల్లో: రేష్మారాణి సతపతి: “ప్రభుత్వ ప్యాడ్లు సౌకర్యంగా లేవని మహిళలు చెప్పారు. పదేపదే కొనే ఆర్థిక స్థోమత వారికి లేదు. అందుకే ఈ రీయూజబుల్ ఆర్గానిక్ ప్యాడ్స్ తయారు చేశాం.”
అమృతా స్వైన్: “మేం ప్యాడ్లు ఇచ్చినా వారు గుడ్డలే వాడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయాం. సౌకర్యవంతమైన ప్యాడ్లను అందించాలన్నదే మా లక్ష్యం.”
స్నేహా గౌడ్: “మేం తయారు చేసిన ప్యాడ్లు చాలా సౌకర్యంగా ఉన్నాయని మహిళలు ఇష్టపడుతున్నారు. ఇవి పూర్తిగా సహజసిద్ధమైనవి, తిరిగి వాడగలిగేవి.”


