Parliament Monsoon Session: నేటి నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల ప్రారంభం ముందు ప్రధాన మంత్రి మోదీ మీడియాతో మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు విజయవంతం కావాలని ఆకాక్షించారు. ఈ మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్, భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు.
ఆపరేషన్ సింధూర్ తో మన దేశ సైనికుల సత్తా ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు.
ఆపరేషన్ సింధూర్ లో మన సైనికులు వందశాతం లక్ష్యాలను సాధించారని ప్రధాని చెప్పారు. నిర్దిష్టమైన లక్ష్యంలో కేవలం 22 నిమిషాల్లోనే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌తో భారత దేశ సైనిక సామర్థ్యం, గొప్పతనం ప్రపంచం మొత్తం చూసిందన్నారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మేడిన్ ఇండియా ఆయుధాల గురించే మాట్లాడుతోందన్నారు.
మన ఆయుధాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని, నక్సలిజాన్ని సమూలంగా నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ప్రధాని మీడియా ముఖంగా తెలియజేసారు. మన దేశ ఎంపీలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో పర్యటించి ఆపరేషన్ సింధూర్ విజయం గురించి వివరించారని మోదీ తెలిపారు.
Readmore: https://teluguprabha.net/national-news/technical-glitch-in-indigo-flight-tirupati/
పాకిస్థాన్ దుష్ట చర్యలను అంతర్జాతీయంగా ఎండగట్టినట్లు చెప్పారు. తుపాకులు, బాంబులు ఉన్నా మన రాజ్యాంగం ముందు నిలబడలేకపోయాయని స్పష్టంచేశారు. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్ విజయంపై వేడుక చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన విషయంలో రాజకీయ పార్టీలూ, ప్రతీ ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ మీడియా సమావేశంలో భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర గురించి కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మువ్వనన్నెల జెండా ఎగరడం మన దేశ ప్రజలందరికీ గర్వకారణమన్నారు. ఈ అంతరిక్ష యాత్ర ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని ప్రశంసించారు.
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయని ప్రధాని అన్నారు. ఇది రైతులకు ఎంతో లాభదాయకమని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.


