PM Modi on Operation Sindoor debate : పార్లమెంటులో ‘ఆపరేషన్ సిందూర్’పై చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఇరుకున పెడదామనుకున్న విపక్షాల వ్యూహం బెడిసికొట్టిందా..? ఆ చర్చతో వారే రాజకీయంగా దెబ్బతిన్నారా..? ఈ వ్యూహాత్మక తప్పిదంతో ప్రతిపక్షాలు తమ గొయ్యి తామే తీసుకున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు భావిస్తున్నారు..? ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న విశ్లేషణ ఏంటి..?
తమను తామే దెబ్బతీసుకున్నారు: పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’పై పార్లమెంటులో చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఒక రాజకీయ తప్పిదంగా అభివర్ణించారు. మంగళవారం జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ చర్చ వల్ల ప్రతిపక్షాలు తీవ్రంగా నష్టపోయాయని, తమకు తామే హాని చేసుకున్నాయని ఎద్దేవా చేశారు. “వారు చర్చకు పట్టుబట్టారు, కానీ ఆ చర్చలో వారే పూర్తిగా దెబ్బతిన్నారు. ఇది వారి ‘సెల్ఫ్ గోల్’ (స్వయంకృతాపరాధం)” అని ప్రధాని వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఎన్డీయే భేటీలో మోదీకి సన్మానం : అంతకుముందు, ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి ఘనంగా స్వాగతం లభించింది. ఆపరేషన్ సిందూర్, ఆపరేషన్ మహాదేవ్ విజయవంతమైనందుకు గాను ఎన్డీయే ఎంపీలు హర్షధ్వానాలతో, ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. పాక్‌లోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని మోదీని ఘనంగా సత్కరించారు.
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక తీర్మానం : ఈ సమావేశంలో ఎన్డీయే ఎంపీలు ‘ఆపరేషన్ సిందూర్’పై ఒక ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించారు. “ప్రధాని మోదీ అచంచలమైన సంకల్పం, దార్శనికత, దృఢమైన సంకల్ప బలం దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయి” అని తీర్మానంలో కొనియాడారు. ఆపరేషన్ సమయంలో భారత సాయుధ దళాలు చూపిన ధైర్యానికి, నిబద్ధతకు సెల్యూట్ చేశారు. పహల్గాం ఉగ్రమూక దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిని స్మరించుకుంటూ సంతాపం ప్రకటించారు.
ఈ ఆపరేషన్ తర్వాత, ఉగ్రవాదంపై భారత్ వైఖరిని ప్రపంచానికి తెలియజేయడానికి, 59 మంది ఎంపీల బృందం 32 దేశాలను సందర్శించడం చరిత్రాత్మకమని, ఇంతటి సమగ్రమైన ప్రపంచ ప్రచారాన్ని చేపట్టినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్‌లో ఏం జరిగింది : గత వారం పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ ఉభయ సభల్లో వాడివేడిగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి వారు ప్రభుత్వ భద్రతా, విదేశాంగ విధానాలను ప్రశ్నించి, ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీటుగా బదులిచ్చారు. చివరగా ప్రధాని మోదీ తనదైన శైలిలో విపక్షాల పాలనలోని తప్పిదాలను ఏకరువు పెడుతూ, వారి విమర్శలను తిప్పికొట్టారు. ఈ చర్చ మొత్తం విపక్షాలకే నష్టం చేసిందని మోదీ ఇప్పుడు విశ్లేషించడం గమనార్హం.


