భారత ప్రధాని నరేంద్ర మోదీకి (PM Narendra Modi) మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన గయానా అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ అందుకున్నారు. మోదీని గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అవార్డును అందించారు. ప్రపంచ వేదికపై అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కుల కోసం, ప్రపంచ సమాజానికి విశేష సేవలందించినందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీకి గయానా అత్యున్నత పౌర పురస్కారం ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్ – గయానా సంబంధాలను బలోపేతం చేసేందుకు ఆయన చేసిన కృషికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ అవార్డును స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi) మాట్లాడుతూ… ఈ గౌరవాన్ని భారతదేశ ప్రజలకు, రెండు దేశాల ప్రజల మధ్య పాతుకుపోయిన చారిత్రక సంబంధాలకు అంకితం చేశారు. భారతదేశం-గయానా మధ్య స్నేహాన్ని మరింత పెంపొందించడం పట్ల భారతదేశ నిరంతర నిబద్ధతకు తన పర్యటన నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ అవార్డు అందుకోవడం తనకి చాలా సంతోషంగా ఉందని మోదీ తెలిపారు. కాగా, గయానా అత్యున్నత జాతీయ అవార్డును అందుకున్న నాలుగో విదేశీ నేత ప్రధాని మోదీ కావడం విశేషం.