తెలంగాణలో రాజకీయ దుమారంం రేపిన కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై ప్రధాని మోదీ(PM Modi) తొలిసారి స్పందించారు. హర్యానా యమునా నగర్ ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని విమర్శించారు. ఈ క్రమంలోనే హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలి భూములపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అటవీ భూములను నాశనం చేస్తుందని విమర్శించారు. బీజేపీ మంచి పనులు చేయాలని చూస్తుంటే కాంగ్రెస్ ఉన్న అడవులను నాశనం చేస్తుందని మండిపడ్డారు. ప్రకృతి, జంతువులకు నష్టం జరిగితే ప్రమాదమని.. అటవీ భూముల్లో బుల్డోజర్లు నడుపుతున్నారని ధ్వజమెత్తారు.
ఇక వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న నిరసనలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో వక్ఫ్ రూల్స్‌ను తమ స్వార్థానికి మార్చేసిందని ఆరోపించారు. అధికారం కోసం పవిత్రమైన రాజ్యాంగాన్ని ఆయుధంలా వాడుకుంటూ.. ఓటు బ్యాంకు వైరస్‌ను వ్యాప్తి చేసిందని దుయ్యబట్టారు. ముస్లింలకు మద్దతుగా నిరసనలు చేపడుతున్న కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో ఎందుకు పార్టీలో ఉన్నత స్థానాలను ఇవ్వలేదని ప్రశ్నించారు.