మూడో సారి తన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ(PM Modi) కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్‌సభలో మాట్లాడుతూ.. వికసిత్ భారత్ ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అన్నారు. మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అని నినాదాలు మాత్రమే చేశాయని విమర్శించారు. కొందరు నేతలు పేదల గుడిసెల వద్ద వారితో ఫొటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తారుని.. కానీ సభలో వారి గురించి మాట్లాడితే మాత్రం విసుగు చెందుతారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి విమర్శలు చేశారు.
తమ ప్రభుత్వ విధానాల వల్ల గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని జయించారని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగం ఆత్మ విశ్వాసం నింపిందని.. అంతేకాకుండా ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని చెప్పారు. నకిలీ నినాదాలు ఇవ్వలేదని.. ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని ప్రధాని వెల్లడించారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే.. గ్రామాలకు 16పైసలే చేరుతోందని గతంలో ఓ ప్రధాని వాపోయారని గుర్తుచేశారు. అప్పట్లో ఢిల్లీ నుంచి గల్లీ వరకూ ఒకే ప్రభుత్వం ఉన్నా అదే పరిస్థితి ఉండేదన్నారు. కానీ ఇప్పుడు నగదు బదిలీ ద్వారా ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామానికి రూపాయి అందుతోందని మోదీ పేర్కొన్నారు.