చైనా, జపాన్, అమెరికా సహా పలు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ BF7 కేసులను భారత్ లోనూ గుర్తించారు. శరవేగంగా వ్యాపిస్తూ.. మృత్యుఘంటికలు మోగిస్తోన్న ఈ వేరియంట్ పై భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో హై అలర్ట్ ప్రకటించింది. రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లేవారు మాస్కులు ధరించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించగా.. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన అత్యున్నతస్థాయి సమావేశం జరగనుంది.
మంత్రి మన్‌సుఖ్ మాండవీయ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను, నిపుణుల సూచనలను.. మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో వివరించనున్నారు. రాష్ట్రాలను అప్రమత్తం చేయడం వంటి పలు అంశాలను ఆరోగ్యమంత్రి ప్రధాని దృష్టికి తీసుకురానున్నారు. కాగా.. కరోనా పీడపోయిందనుకుంటే.. మళ్లీ BF7 వేరియంట్ రూపంలో అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా ఏపీలోని కోనసీమ జిల్లా ఒమిక్రాన్ కేసును గుర్తించినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది.