Assembly Elections: మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఒకే విడతలో మొత్తం 288 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతుండగా.. ఝార్ఖండ్‌లో రెండో విడతలో 38 నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. దీంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కాగా మహారాష్ట్ర ఎన్నికల్లో(Maharastra Assembly Elections) పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ముంబైలోని రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఓటు హక్కు వినియోగించుకోగా.. బారామతిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఓటు వేశారు. ఇక నాగ్‌పుర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఓటు వేశారు. వీరితో అక్షయ్ కుమార్, కబీర్ ఖాన్, రాజ్ కుమార్ రావ్, గౌతమీ కపూర్, అలీ ఫజల్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఎంపీ సుప్రియా సూలే తన కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, భార్య అంజలి, కుమార్తె సారాతో కలిసి ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతో బలమైన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.