Pregnancy Leave Karnataka MLA Controversy: కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే మహిళా అధికారిణిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. చన్నగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే శివగంగ బసవరాజ్, అటవీ శాఖకు చెందిన ఒక మహిళా అధికారిణిపై లింగ వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
కర్ణాటక అభివృద్ధి కార్యక్రమం (KDP) త్రైమాసిక సమీక్షా సమావేశంలో శివగంగ బసవరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ రేంజ్ అధికారిణి శ్వేత సమావేశానికి హాజరు కాకపోవడంపై ఆయన ప్రశ్నించారు. శ్వేత గర్భవతి కావడంతో రాలేకపోయారని అధికారులు చెప్పగా, ఎమ్మెల్యే అదుపు తప్పి మాట్లాడారు.
ALSO READ: JDU First List: జేడీయూ ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. సీఎం నితీష్ కుమార్‌కు నో టికెట్.. ఎందుకో తెలుసా?
సమావేశంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలు
“ఆమె గర్భవతి అయితే సెలవు తీసుకోవాలి. పని చేయాల్సిన అవసరం ఏముంది? ఆమె డబ్బులు సంపాదించుకోవాలనుకుంటుంది, కానీ పని గురించి సమావేశానికి పిలిస్తే మాత్రం సెలవు కావాలంటుంది. సిగ్గు లేదా?” అని ఎమ్మెల్యే బహిరంగంగా ప్రశ్నించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, “మ్యాటర్నిటీ సెలవులు (ప్రసూతి సెలవులు) ఉన్నాయి కదా? చివరి తేదీ వరకు జీతం, ఇతర అదనపు ప్రయోజనాలు కావాలి. కానీ పని గురించి పిలవగానే సమావేశానికి రాలేరు. గర్భం ఒక సాకు (Pregnancy is an excuse), సిగ్గు పడాలి. ప్రతిసారీ ఇదే సాకు. ‘నేను గర్భవతిని, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను’ అని చెబుతుంది” అని బసవరాజ్ వ్యాఖ్యానించారు.
ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అక్కడి అధికారులను ఆదేశించారు.
ALSO READ: Mallojula Venugopal: ఆయుధాలు వదిలిన అగ్రనేత.. మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయిన మల్లోజుల
మహిళా హక్కుల కార్యకర్తలు ఈ వీడియోను షేర్ చేస్తూ, సంక్లిష్టమైన, సున్నితమైన అంశాన్ని లింగ వివక్షతో కూడిన జోక్‌గా మార్చినందుకు ఎమ్మెల్యేను తీవ్రంగా విమర్శించారు. ఇటీవలనే, కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే మహిళలకు నెలకు ఒక రోజు వేతనంతో కూడిన రుతుస్రావ సెలవు (Paid Menstrual Leave) ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ప్రతిపక్ష బీజేపీ ఈ అంశాన్ని లేవనెత్తి సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతోంది.


