Priyanka gandhi| దేశంలో మరోసారి ఎన్నికల హడావిడి నెలకొంది. నవంబర్ నెలలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే, ఎంపీల స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే కేరళలోని వయనాడ్(Wayanad) స్థానానికి కూడా బై ఎలక్షన్ జరగనుంది. ఈ స్థానానికి కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) పోటీ చేయనున్నారనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నవంబర్ 13న జరగనున్న ఈ ఎన్నికకు ఈనెల 23న వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా హాజరుకానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేయనున్నట్లు తెలిపాయి.
కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ.. యూపీలోని రాయ్‌బరేలీ, కేరళలోని వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల భారీ విజయంతో గెలుపొందారు. అయితే ఓ స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటంతో రాయ్‌బరేలీలో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో వయనాడ్ స్థానాన్ని వదులుకోవడంతో ఇక్కడ బైపోల్ అనివార్యమైంది. ఈ క్రమంలోనే సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పెద్దలు డిసైడ్ అయ్యారు. అందుకే గాంధీ కుటుంబసభ్యురాలైన ప్రియాంక గాంధీని బరిలోకి దింపారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు ప్రియాంకను ఓడించడానికి బీజేపీ కూడా పావులు కదుపుతోంది. సినీ నటి ఖుష్భూను పోటీ చేయించాలని యోచిస్తోంది.
ఇదిలా ఉంటే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లోని 47 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలతో పాటు వయనాడ్‌కు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. జార్ఖండ్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా నవంబర్ 13న, రెండో దశ పోలింగ్ నవంబర్ 20న జరగనుందిఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలోనే నవంబర్ 20న నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.