Rahul Gandhi on Election Commission : “భారత ఎన్నికల వ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని, అధికార పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత, దేశంలో “ఓట్ల చౌర్యం” జరుగుతోందన్న తమ అనుమానాలు నిజమయ్యాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కైందని, దొంగ ఓట్లతో ఫలితాలను తారుమారు చేసేందుకు భారీ మోసానికి తెరలేపిందని ఆరోపించారు. సాక్ష్యాలను దాచిపెడుతున్న ఈసీ, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో, రాహుల్ చేసిన ఆరోపణల పరంపర దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు రాహుల్ అనుమానాలకు కారణాలేమిటి..? ఆయన ఎత్తిచూపుతున్న ఉదాహరణలేంటి..?
రాహుల్ ఆరోపణల పరంపర : ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన ఆరోపణలను పరిశీలిస్తే…
“ఓట్ల చౌర్యం” నిజమైంది: “మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు చూశాక, అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చౌర్యం జరిగిందనే మా అనుమానం నిజమైంది. యంత్రాలు తనిఖీ చేసే ఓటర్ల జాబితా (సాఫ్ట్‌కాపీ) ఇవ్వడానికి ఈసీ నిరాకరిస్తోంది. బీజేపీతో కలిసి దొంగ ఓట్లకు పాల్పడుతోంది,” అని రాహుల్ నేరుగా ఆరోపించారు.
కర్ణాటక, మహారాష్ట్ర ఉదాహరణలు..
కర్ణాటక: “మహదేవపుర నియోజకవర్గంలోని 6.5 లక్షల ఓట్లలో దాదాపు లక్ష ఓట్లు చోరీకి గురయ్యాయి. డూప్లికేట్ ఓటర్లు, తప్పుడు చిరునామాలతో ఈ మోసం జరిగింది,” అని ఆయన ఉదహరించారు.
మహారాష్ట్ర: “కేవలం 5 నెలల్లో 40 లక్షల మంది కొత్త ఓటర్లు ఎలా నమోదయ్యారు? ఇది గడిచిన ఐదేళ్లలో నమోదైన వారి కంటే ఎక్కువ. సాయంత్రం 5 గంటల తర్వాత భారీగా పోలింగ్ శాతం పెరిగింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అడిగితే ఈసీ ఇవ్వడం లేదు,” అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు.
ఎగ్జిట్ పోల్స్‌కు, ఫలితాలకు పొంతన లేదు: కొంతకాలంగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్‌కు భిన్నంగా ఫలితాలు రావడంపై రాహుల్ సందేహాలు వ్యక్తం చేశారు. “ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి వర్తించదా..? హరియాణా, మధ్యప్రదేశ్‌లో పోల్స్‌కు విరుద్ధంగా ఆకస్మికంగా ఫలితాలు ఎలా మారాయి..? దీనికి వారు లాడ్లీ బెహనా, పుల్వామా, ఇప్పుడు సిందూర్ వంటి కారణాలు చెబుతున్నారు. వాస్తవం ఏమంటే, ఫలితాలను తారుమారు చేస్తున్నారు,” అని విమర్శించారు.
సాక్ష్యాలను దాస్తున్న ఈసీ: “ఓటర్ల జాబితా, సీసీటీవీ ఫుటేజ్ ఈ మోసానికి కీలక సాక్ష్యాలని, కానీ ఎన్నికల సంఘం (ఈసీ) వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. “ఓటర్ల జాబితా దేశ సంపద. దానిని విశ్లేషించే హక్కు మాకుంది. దాన్ని ఎందుకు చూపించడం లేదు..?” అని ఆయన ఈసీని సూటిగా ప్రశ్నించారు.
చిన్న మెజారిటీలతోనే బీజేపీ గెలుపు: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానికి అధికారంలోకి రావడానికి 25 సీట్లు అవసరం కాగా, బీజేపీ 25 స్థానాల్లో 33 వేల ఓట్ల కంటే తక్కువ మెజారిటీతోనే గెలిచిందని, ఇది కూడా అనుమానాలకు తావిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈవీఎంలు లేనప్పుడు దేశమంతా ఒకేరోజు జరిగే ఎన్నికల ప్రక్రియ, ఇప్పుడు నెలలపాటు సాగడం కూడా సందేహాలకు కారణమని రాహుల్ అన్నారు.


