Saturday, November 15, 2025
Homeనేషనల్RahulGandhi : మా బావపై వేధింపులు.. బీజేపీపై రాహుల్ బాణాలు!

RahulGandhi : మా బావపై వేధింపులు.. బీజేపీపై రాహుల్ బాణాలు!

Rahul Gandhi on Robert Vadra case : గాంధీ కుటుంబంపై మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై హరియాణా భూముల కుంభకోణం కేసులో ఛార్జిషీట్ దాఖలు చేయడంతో రాజకీయ వేడి రాజుకుంది. ఇది కేవలం చట్టం తనపని తాను చేసుకుపోవడమా, లేక పదేళ్ల రాజకీయ కక్ష సాధింపులో భాగమా..? 

- Advertisement -

తన బావ రాబర్ట్ వాద్రాపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండించారు. బిజెపి ప్రభుత్వం పదేళ్లుగా వాద్రాను వెంటాడుతూ, రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ఈ కష్ట సమయంలో తన సోదరి ప్రియాంక, బావ రాబర్ట్ వాద్రాల కుటుంబానికి తాను పూర్తి అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీ స్పందిస్తూ, “గత పదేళ్లుగా ఈ ప్రభుత్వం మా బావను వేధిస్తోంది. ఇప్పుడు దాఖలు చేసిన ఛార్జిషీట్ కూడా ఆ రాజకీయ కక్ష సాధింపు దాడిలో కొనసాగింపే. ఇవన్నీ దురుద్దేశపూరితమైన, రాజకీయ ప్రేరేపితమైన నిందలు. ఈ సమయంలో నేను రాబర్ట్, ప్రియాంక, వారి పిల్లలకు మద్దతుగా ఉంటాను. ఎలాంటి దాడినైనా తట్టుకునేంత ధైర్యం వారికి ఉందని నాకు తెలుసు. అంతిమంగా సత్యమే గెలుస్తుంది,” అని పేర్కొన్నారు.

అసలు కేసు ఏంటి : ఈడీ ఆరోపణల ప్రకారం, ఈ కేసు గురుగ్రామ్‌లోని శికోహ్‌పుర్ గ్రామంలోని 3.5 ఎకరాల భూమికి సంబంధించినది.

కొనుగోలు: 2008 ఫిబ్రవరిలో రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ, ఓంకారేశ్వర్‌ ప్రాపర్టీస్ నుంచి ఈ భూమిని రూ. 7.5 కోట్లకు కొనుగోలు చేసింది.

అమ్మకం: కొనుగోలు చేసిన కొద్ది కాలానికే, వాద్రా కంపెనీ ఈ భూమికి వాణిజ్య లైసెన్సులు పొంది, దానిని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎల్‌ఎఫ్‌ (DLF)కు ఏకంగా రూ. 58 కోట్లకు విక్రయించింది.

ఆరోపణలు: తక్కువ ధరకు భూమి కొని, ప్రభుత్వ పెద్దల అండతో లైసెన్సులు పొంది, అక్రమంగా కొన్ని రెట్లు ఎక్కువ లాభానికి అమ్ముకోవడం ద్వారా భారీగా మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ప్రధాన ఆరోపణ.

ఎఫ్ఐఆర్: ఈ వ్యవహారంలో నాటి హరియాణా ముఖ్యమంత్రి భూపిందర్‌ సింగ్‌ హుడాపైనా ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో 2018లో వాద్రా, హుడా తదితరులపై ఫోర్జరీ, చీటింగ్, అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

ఈ కేసులో భాగంగా ఈడీ ఇప్పటికే పలుమార్లు రాబర్ట్ వాద్రాను విచారించింది. తాజాగా ఆయనతో పాటు మరో 10 మంది పేర్లను చేర్చుతూ ఛార్జిషీట్ దాఖలు చేయడంతో ఈ కేసు మరోసారి దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad