Sunday, November 16, 2025
Homeనేషనల్End of Registered Post : అక్షరాలకు అడ్రస్ మారింది.. 'రిజిస్టర్డ్ పోస్ట్‌'కు గుడ్‌బై!

End of Registered Post : అక్షరాలకు అడ్రస్ మారింది.. ‘రిజిస్టర్డ్ పోస్ట్‌’కు గుడ్‌బై!

End of Registered Post : ఉద్యోగ దరఖాస్తులైనా, కోర్టు నోటీసులైనా, యూనివర్సిటీ సర్టిఫికెట్లైనా.. ఒకప్పుడు వీటన్నిటికీ ఏకైక చిరునామా ‘రిజిస్టర్డ్ పోస్ట్’. 50 ఏళ్లకు పైగా భారతీయుల జీవితాలతో పెనవేసుకుపోయిన ఈ నమ్మకమైన సేవ, ఇక చరిత్ర పుటల్లోకి చేరనుంది. భారత తపాలా శాఖ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి రిజిస్టర్డ్ పోస్ట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..? తక్కువ ధరకే దొరికే ఈ నమ్మకమైన సేవను ఎందుకు నిలిపివేస్తున్నారు..?

- Advertisement -

రిజిస్టర్డ్ పోస్ట్ సేవను పూర్తిగా ‘స్పీడ్ పోస్ట్’ సేవలో విలీనం చేస్తున్నట్లు తపాలా శాఖ స్పష్టం చేసింది. దీంతో అత్యంత చౌకగా, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచిన ఈ సేవకు కాలం చెల్లినట్లయింది.

తగ్గిన ఆదరణ.. పెరిగిన టెక్నాలజీ: ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం, రిజిస్టర్డ్ పోస్ట్ వాడకం గణనీయంగా తగ్గిపోవడమే.

డిజిటల్ విప్లవం: వాట్సాప్, జీమెయిల్ వంటి డిజిటల్ మాధ్యమాల రాకతో సమాచార మార్పిడి వేగవంతమైంది. ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇప్పుడు డిజిటల్ మార్గంలోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతున్నాయి.

గణాంకాలే సాక్ష్యం: 2011-12 ఆర్థిక సంవత్సరంలో 24.4 కోట్ల రిజిస్టర్డ్ పోస్టులను పంపిణీ చేయగా, 2019-20 నాటికి ఆ సంఖ్య 25% తగ్గి, 18.4 కోట్లకు పడిపోయింది. స్పీడ్ పోస్ట్, ఇతర కొరియర్ సేవలు అందుబాటులోకి రావడంతో రిజిస్టర్డ్ పోస్ట్‌కు డిమాండ్ తగ్గింది. ఈ నిర్ణయం వల్ల సామాన్యులు, పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలపై అదనపు భారం పడనుంది.

ఆర్థిక భారం:రిజిస్టర్డ్ పోస్ట్: ప్రారంభ ఛార్జీ రూ. 26 నుంచి రూ. 30 వరకు ఉంటుంది.
స్పీడ్ పోస్ట్: ప్రారంభ ఛార్జీ రూ. 41. ఇది రిజిస్టర్డ్ పోస్ట్‌తో పోలిస్తే 20-25% ఎక్కువ.
న్యాయవ్యవస్థ: కోర్టులు, న్యాయవాదులు నోటీసులను పంపడానికి రిజిస్టర్డ్ పోస్ట్‌నే అధికారిక రుజువుగా (Legal Proof of Communication) పరిగణిస్తారు. ఇకపై వారు ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

విద్యార్థులు, విద్యాసంస్థలు: యూనివర్సిటీలు, పరీక్షా బోర్డులు అడ్మిట్ కార్డులు, సర్టిఫికెట్లను పంపడానికి ఈ సేవనే వాడతాయి. ఇది విద్యార్థులపై భారం మోపుతుంది.
గ్రామీణ ప్రజలు, సీనియర్ సిటిజన్లు: డిజిటల్ సేవలు అందుబాటులో లేని, వాటిపై నమ్మకం తక్కువగా ఉన్న గ్రామీణ ప్రజలు, వృద్ధులు రిజిస్టర్డ్ పోస్ట్‌పైనే ఆధారపడతారు. వారికి ఇది పెద్ద దెబ్బే.

తపాలా శాఖ వాదన : అయితే, ఈ విలీనం వల్ల వినియోగదారులకు ప్రయోజనమే చేకూరుతుందని తపాలా శాఖ వాదిస్తోంది.

వేగవంతమైన సేవ: స్పీడ్ పోస్ట్ ద్వారా ఉత్తరాలు, పార్శిళ్లు చాలా వేగంగా డెలివరీ అవుతాయి.

మెరుగైన ట్రాకింగ్: డిజిటల్ వేదికల ద్వారా పోస్ట్‌ను ఎక్కడుందో సులభంగా ట్రాక్ చేసుకునే సౌకర్యం ఉంటుంది.

సేవల ఆధునికీకరణ: తపాలా శాఖ తన సేవలను ఆధునికీకరించే ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు చేస్తున్నామని, ఇది కస్టమర్ల సౌకర్యం కోసమేనని చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, అర్ధ శతాబ్దానికి పైగా సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఓ నమ్మకమైన సేవకు వీడ్కోలు పలకడం ఖాయమైపోయింది. నమ్మకానికి, తక్కువ ధరకే చిరునామాగా నిలిచిన ఓ సేవ కాలగర్భంలో కలిసిపోతుండగా, వేగం, ఆధునికత పేరుతో మరో సేవ అధిక ధరతో ముందుకు వస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad