Friday, February 21, 2025
Homeనేషనల్Delhi CM: అసలు ఎవరీ రేఖా గుప్తా.. ఢిల్లీ న్యూ సీఎం ప్రొఫైల్..!

Delhi CM: అసలు ఎవరీ రేఖా గుప్తా.. ఢిల్లీ న్యూ సీఎం ప్రొఫైల్..!

ఢిల్లీ సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఢిల్లీ సీఎంగా బీజేపీ ఎవరిని ఎంపిక చేస్తుందనే ఉత్కంఠ కొనసాగుతూ వచ్చింది. తాజాగా బీజేపీ శాసనసభ పక్షం సీఎం అభ్యర్థిని ఎన్నుకుంది. షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రేఖా గుప్తాను బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంగా ఎన్నుకున్నారు. గురువారం రామ్‌లీలా మైదానంలో జరిగే కార్యక్రమంలో ఆమె ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు.

- Advertisement -

ఎవరీ రేఖా గుప్తా: 50 ఏళ్ల రేఖా 1974లో హర్యానాలోని జింద్ జిల్లాలోని నంద్‌గఢ్ గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అధికారి. రేఖా కుటుంబం 1976లో ఢిల్లీకి మారింది. అప్పటికి ఆమెకు రెండేళ్ల వయసు. దీని తరువాత, రేఖా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య ఢిల్లీలో జరిగింది. తన బాల్యంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) విద్యార్థి విభాగం అయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో చేరారు.

ఢిల్లీ విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు, ఆమె దౌలత్ రామ్ కళాశాలలో కార్యదర్శి ఎన్నికల్లో విజయం సాధించారు. 1995–96లో, ఆమె ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీ చేసి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. రేఖా తన చదువును LLB వరకు పూర్తి చేశారు. తన చదువు పూర్తయిన తర్వాత, రేఖా గుప్తా 2003-04లో బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్‌లో చేరి కార్యదర్శి పదవిని చేపట్టారు.

2004 నుండి 2006 వరకు ఆమె భారతీయ జనతా యువ మోర్చా జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. ఇక 2007లో ఉత్తర పితంపుర నుండి కౌన్సిలర్ ఎన్నికయ్యారు. 2007-09 వరకు ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీకి రెండు సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా ఉన్నారు. 2009లో ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఇక 2010లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతను నిర్వహించారు. ఇక రేఖా గుప్తా 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె షాలిమార్ బాగ్ స్థానం నుండి పోటీ చేశారు. 2015లో ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వందన కుమారి చేతిలో దాదాపు 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో దాదాపు 3,400 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె వందన కుమారిని భారీ తేడాతో ఓడించారు.

ఇక ఢిల్లీ సీఎం, మంత్రుల గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రితో పాటు 6 మంది మంత్రులు ప్రమాణం చేస్తారు. ఈ వేడుక మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం రాంలీలా మైదానంలో నిర్వహిస్తారు. ఇందు కోసం ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరవుతారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News