Monday, November 17, 2025
Homeనేషనల్COVID-19: కరోనాతో వేగంగా ముసలితనం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

COVID-19: కరోనాతో వేగంగా ముసలితనం? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

COVID-19 Pandemic Accelerate Brain Ageing: ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కేవలం శారీరక ఆరోగ్యంపైనే కాకుండా, మానసిక ఆరోగ్యం, ముఖ్యంగా మెదడు పనితీరుపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతోందని కొత్త అధ్యయనం ఒకటి వెల్లడించింది. ఆశ్చర్యకరంగా, కోవిడ్ బారిన పడని ఆరోగ్యవంతులైన పెద్దవారిలో సైతం మెదడు వృద్ధాప్యం వేగవంతమైందని ఈ పరిశోధన సంచలనం సృష్టిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో పెరిగిన ఒత్తిడి, ఏకాంతం, మరియు దైనందిన జీవితంలో ఏర్పడిన తీవ్ర అంతరాయాలే దీనికి ప్రధాన కారణాలని శాస్త్రవేత్తలు గుర్తించారు.

- Advertisement -

అధ్యయనం ఏం చెబుతోంది?

యూకే బయోబ్యాంక్ నుండి సేకరించిన 996 మంది ఆరోగ్యవంతులైన పెద్దల మెదడు స్కాన్‌లను నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు లోతుగా విశ్లేషించారు. ఈ విశ్లేషణలో వారు గుర్తించిన అంశాలు ఆందోళనకరంగా ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో సగటున 5.5 నెలలు మెదడు వృద్ధాప్యం వేగవంతమైనట్లు తేలింది.

ముఖ్యంగా, వృద్ధులు, పురుషులు (సుమారు ఆరు నెలలు వేగంగా మెదడు వృద్ధాప్యం), పేదరికం, వనరుల కొరత వంటి ప్రతికూల నేపథ్యాలున్న వ్యక్తులు (ఏడు నెలల వరకు అదనపు మెదడు వృద్ధాప్యం) ఈ ప్రభావానికి ఎక్కువగా గురయ్యారని అధ్యయనం వెల్లడించింది.

ఒత్తిడే ప్రధాన కారణమా?

కరోనా మహమ్మారి సమయంలో ఎదురైన మానసిక ఒత్తిడి, నిరంతర ఆందోళనలు మెదడులోని పలు నిర్మాణాలను మార్చినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే, కోవిడ్-19 వైరస్ సోకినవారిలో మాత్రం మెదడు సామార్థ్యం క్షీణించినట్లు తేలింది. అంటే, వైరస్ సోకినవారిలో మెదడు పనితీరులో మార్పులు రాగా, వైరస్ సోకనివారిలో దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల మెదడు నిర్మాణంలో మార్పులు వచ్చాయని అర్థం చేసుకోవచ్చు.

ఈ మార్పులు శాశ్వతమా?

ప్రస్తుతానికి, ఈ మెదడు మార్పులు ఎంతకాలం ఉంటాయో, అవి శాశ్వతమా కాదా అనేది స్పష్టంగా తెలియదని పరిశోధకులు అంటున్నారు. అయితే, ఈ అధ్యయనం ఒక ముఖ్యమైన విషయాన్ని హైలైట్ చేసింది. వ్యాధులు మాత్రమే కాకుండా, పర్యావరణ కారకాలు, దైనందిన జీవితానుభవాలు కూడా మెదడు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయని ఈ అధ్యయనం తేల్చింది.

మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా?

ఈ పరిశోధన ఫలితాల నేపథ్యంలో, మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. అధ్యయనం సూచించిన పలు మార్గాలు:

  • సామాజిక సంబంధాలు: స్నేహితులు, కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటం.
  • శారీరక శ్రమ: క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.
  • ఆరోగ్యకరమైన ఆహారం: మెదడుకు మేలు చేసే పోషకాలున్న ఆహారం తీసుకోవడం.
  • మానసిక శ్రేయస్సు: ఒత్తిడిని తగ్గించుకోవడం, ధ్యానం వంటివి సాధన చేయడం.
  • తగిన నిద్ర: రోజుకు 7-8 గంటలు నిద్రపోవడం.
  • మెదడుకు పని చెప్పడం: కొత్త విషయాలు నేర్చుకోవడం, పజిల్స్ సాల్వ్ చేయడం.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad