Artificial Womb: తల్లిగా మారాలనే లక్షలాది మంది మహిళల కలలను సాకారం చేసే దిశగా వైద్యశాస్త్రంలో ఒక అద్భుతం జరిగింది. వంధ్యత్వం లేదా IVF విఫలమైన కారణంగా నిరాశలో ఉన్న జంటలకు, శాస్త్రవేత్తల తాజా పరిశోధన కొత్త ఆశాకిరణాన్ని అందిస్తోంది. చర్మ కణాల నుంచే మానవ గుడ్లను సృష్టించడంలో పరిశోధకులు విజయం సాధించారు, ఇది సంతానం లేని వారికి గొప్ప వరం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా సంతానం లేక బాధపడుతున్న ఎంతో మంది జంటల నిరీక్షణకు ఈ పరిశోధన ఒక ముగింపు పలికే అవకాశం ఉంది. అమెరికాలోని ఒరెగాన్ హెల్త్ & సైన్స్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ శౌఖ్రత్ మిటాలిపోవ్ నాయకత్వంలో, ఈ అద్భుతమైన అధ్యయనాన్ని విజయవంతంగా నిర్వహించింది.
మొదట, ఒక సాధారణ చర్మ కణాన్ని తీసుకుంటారు. ఈ కణంలో ఉన్న జన్యు సమాచారం కలిగిన కేంద్రకాన్ని వేరు చేస్తారు. ఆ తర్వాత, దాత నుంచి సేకరించిన గుడ్డులోని జన్యు సంకేతాలను తొలగించి, దానిలో ఈ చర్మ కణం కేంద్రకాన్ని అమర్చుతారు.ఈ విధంగా సృష్టించిన గుడ్డు భవిష్యత్తులో ఫలదీకరణం (ఫెర్టిలైజేషన్)కు ఉపయోగపడుతుంది. అంటే, తల్లి కావాలనుకునే మహిళ సొంత చర్మ కణం నుంచే గుడ్డును సృష్టించే అవకాశం దొరికినట్టే.
వైద్యశాస్త్రంలో ఇప్పటికే IVF వంటి పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ, అవి కూడా కొంతమందికి ఫలితమివ్వడం లేదు. ఈ కొత్త పరిశోధన, IVF విఫలమైన లక్షలాది మంది మహిళలకు ‘అమ్మ’ అని పిలిపించుకునే క్షణాన్ని అందిస్తుంది. గర్భం దాల్చలేని ఎటువంటి కారణాలు ఉన్నా, ఇది ఒక అద్భుత పరిష్కారంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధ్యయనం నేచర్ కమ్యూనికేషన్స్అనే ప్రపంచ ప్రఖ్యాత జర్నల్‌లో ప్రచురితమైంది.
ఈ పరిశోధన విజయవంతమైనప్పటికీ, ఈ ప్రక్రియను వాస్తవ జీవితంలో ఉపయోగించడానికి కనీసం ఒక దశాబ్దం కాలం పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం, ఇందులో అనేక నైతిక , చట్టపరమైన అంశాలు ఇమిడి ఉండటమే.
ఏది ఏమైనప్పటికీ, ఈ పరిశోధన తల్లిదండ్రులు కావాలని తపన పడుతున్న ఎంతో మంది జంటలకు గొప్ప ఆశను కలిగించింది అనడంలో సందేహం లేదు. శాస్త్రవేత్తలు ఈ సవాళ్లను అధిగమిస్తే, గర్భం దాల్చకుండానే పిల్లలను కనే ఒక కొత్త శకానికి ఇది నాంది పలుకుతుంది.


