వేసవి ఉక్కపోతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి శుభవార్త అందించింది. నైరుతి రుతుపవనాలు(Southwest monsoon) ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. అలాగే వచ్చే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు తెలిపింది. సోమవారం ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతాల్లోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రాబోయే వారం రోజులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది.
ఇక ఉత్తర తెలంగాణపై ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిస అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్జ్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని.. ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
