Bihar Voter Roll Revision Can Be Set Aside If: బీహార్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చట్టవిరుద్ధమని రుజువైతే, దానిని రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నవంబర్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) పౌరసత్వం రుజువు కోసం పత్రాలను డిమాండ్ చేయడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పౌరసత్వాన్ని నిర్ణయించే అధికారం ఈసీకి లేదని, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశమని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
“ఐదు కోట్ల మంది పౌరసత్వంపై అనుమానం వ్యక్తం చేసే విధానం ఉండకూడదు. ఆధార్‌ను కూడా పౌరసత్వానికి రుజువుగా ఈసీ అంగీకరించడం లేదు” అని అభిషేక్ సింఘ్వీ వాదించారు.
“పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం ఈసీకి లేదు”
దీనిపై జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ… పౌరసత్వాన్ని నిర్ధారించడం ప్రభుత్వ విధి అయినప్పటికీ, ఓటర్ల జాబితా నుంచి పౌరులు కాని వారిని తొలగించే అధికారం ఈసీకి ఉందని అన్నారు. అయితే, సింఘ్వీ దీనికి బదులిస్తూ… ఒక వ్యక్తి ఓటర్ల జాబితాలో ఇప్పటికే ఉంటే, అతని పౌరసత్వాన్ని ప్రశ్నించే అధికారం ఈసీకి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ వాదనలకు స్పందిస్తూ, “వారు ఐదు కోట్ల మందిని అనర్హులుగా ప్రకటిస్తే, మేము ఇక్కడ ఉన్నాము” అని కోర్టు పేర్కొంది.
ఈసీ ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది ఓటర్లను, ముఖ్యంగా అణగారిన వర్గాల వారిని తొలగించి, బీజేపీకి లబ్ధి చేకూరుస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే, ఈ ఆరోపణలను ఈసీ ఖండించింది.


