Monday, November 17, 2025
Homeనేషనల్Custodial Deaths: పోలీసు స్టేషన్లలో లాకప్‌ డెత్‌లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Custodial Deaths: పోలీసు స్టేషన్లలో లాకప్‌ డెత్‌లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Custodial Deaths in Police Stations: పోలీసు స్టేషన్లలో లాకప్‌ డెత్‌లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం గురువారం పోలీస్ స్టేషన్లలో సీసీటీవీల ఏర్పాటు చేయడం లేదన్న ఆరోపణలను సుమోటోగా కేసు స్వీకరించింది. సీసీటీవీల ఏర్పాట్లపై సమాధానం చెప్పాలని కేంద్ర, రాష్రప్రభుత్వాలను ఆదేశించింది.

వివరాల్లోకి వెళ్తే…గడిచిన 7-8 నెలలకాలంలో పోలీస్ స్టేషన్లలో దేశవ్యాప్తంగా 11 వరకు లాకప్ డెత్‌లు (కస్టోడియల్ మరణాలు) సంభవించాయని.. ఠాణాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదని దైనిక్ జాగరణ్ అనే పత్రికలో ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తూ జస్టిస్ విక్రమ్‌నాథ్, సందీప్ మెయితాలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

వాస్తవానికి దేశంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2020లోనే సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఈ మేరకు జస్టిస్ రోహింగ్టన్ ఫాలినారిమన్, కేఎం జోసెఫ్, అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది.

ఈ తీర్పు అన్ని రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని పోలీసు స్టేషన్లకు వర్తిస్తుంది. రాత్రిళ్లు కూడా వీడియోలు చిత్రీకరించేలా, నైట్ విజన్ ఎఫెక్ట్ ఉన్న కెమెరాలు ఏర్పాటు చేయాలి.

అంతేకాదు సీబీఐ, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, డిపార్టుమెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ , సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్‌ఐవో)లతోపాటు ప్రజలను విచారించే ఏ ఇతర సంస్థలైనా తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు అదే తీర్పులో స్పష్టం చేసింది.

ఈ సీసీటీవీ కెమెరాలు ఆధునాతమైనవిగా, ఆడియో, వీడియో స్పష్టంగా ఉండాలనే నిబంధనలు సైతం తీర్పులో ఉన్నాయి. సీసీటీవీలు నిరంతరం పని చేసేలా ఇంటర్నెట్, విద్యుత్ అందేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

పోలీసు స్టేషన్లలో బంధించే వ్యక్తులు మరణిస్తే (కస్టోడియల్ డెత్) సదరు వ్యక్తి, వ్యక్తుల కుటుంబ సభ్యులు సీసీటీవీల ఫుటేజీ బయటపెట్టాలని న్యాయపోరాటం చేసేందుకు, మానవ హక్కుల కమిషన్‌లో సైతం ఫిర్యాదు చేసే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఒక్క మరణాలే కాదు స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది వల్ల ఫిర్యాదు చేయడానికి వచ్చే సామాన్యులు వేధింపులకు గురవుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో సుప్రీంకోర్టు సీసీటీవీల ఏర్పాటును తప్పనిసరి చేసింది.

అయితే చాలా వరకు పోలీస్ స్టేషన్లు సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోవడం లేదు. కొన్ని చోట్లా సీసీటీవీలు ఉన్నా అవి పని చేయడం లేదు. దీంతో పోలీసుల చర్యల మీద అనుమానాలు పెరిగాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad