Tejashwi Yadav endorses Rahul Gandhi :దేశ రాజకీయ యవనికపై కీలక వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీయే దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆర్జేడీ యువనేత, బిహార్ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి యాదవ్ బల్లగుద్ది మరీ ప్రకటించారు. బిహార్‌లో జరుగుతున్న “ఓటర్ అధికార్ యాత్ర”లో రాహుల్ గాంధీతో కలిసి వేదిక పంచుకున్న ఆయన, ఈ సంచలన ప్రకటనతో జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టించారు. కేవలం రాహుల్ అభ్యర్థిత్వాన్ని బలపరచడమే కాకుండా, బిహార్‌లోని ఎన్డీఏ ప్రభుత్వంపై, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకీ రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం వెనుక తేజస్వి వ్యూహమేంటి..? స్థానిక ప్రభుత్వంపై ఆయన చేసిన ఆరోపణల పరంపరలో వాస్తవమెంత..?
లక్ష్యం ఒక్కటే.. రాహుల్‌ను ప్రధానిని చేయడమే : బిహార్‌లోని నవాడాలో మంగళవారం జరిగిన “ఓటర్ అధికార్ యాత్ర” మూడో రోజు సభలో తేజస్వి యాదవ్ తన ప్రసంగంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపారు. ఆయన మాటల్లోనే…
మోదీకి నిద్రలేని రాత్రులు: “రాష్ట్రవ్యాప్తంగా ఈ యాత్ర చేపట్టి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నిద్రలేని రాత్రులు మిగిల్చిన నాయకుడు రాహుల్ గాంధీ,” అంటూ రాహుల్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందనను ప్రస్తావించారు.
ఎన్డీఏ ఒక పాత కారు: “గత 20 ఏళ్లుగా ఒకే పాత కారును నడుపుతున్న బిహార్‌లోని బలహీనమైన ఎన్డీఏ ప్రభుత్వాన్ని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దె దించడం ఖాయం,” అని తేజస్వి ధీమా వ్యక్తం చేశారు.
స్పష్టమైన ప్రకటన: “అదేవిధంగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే మా లక్ష్యం. కొత్త బిహార్ నిర్మాణం కోసం మా వద్ద స్పష్టమైన విజన్ ఉంది,” అని తేల్చిచెప్పారు.
కాపీక్యాట్ ప్రభుత్వం.. అసలు సమస్యలు గాలికి : అనంతరం ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రభుత్వంపై తేజస్వి విమర్శల వర్షం కురిపించారు. తమ పార్టీ చేసిన వాగ్దానాలనే నీతీశ్ సర్కార్ కాపీ కొట్టి, కొత్త పథకాలుగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.
“ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌కు పాలనపై పట్టు తప్పింది. ఆయన బిహార్‌ను పాలించలేకపోతున్నారు. మేం ప్రతిపాదించిన ఉచిత విద్యుత్, స్థిర నివాసం, సామాజిక భద్రత, పెన్షన్ పెంపు, యువజన కమిషన్ ఏర్పాటు వంటి హామీలనే ఈ ప్రభుత్వం కాపీ కొట్టింది. కానీ, రాష్ట్రానికి అత్యవసరమైన విద్య, ఆరోగ్యం, ఉపాధి, సాగునీరు వంటి కీలక అంశాలను పూర్తిగా గాలికి వదిలేసింది,” అని తేజస్వి దుయ్యబట్టారు.
ఓట్ల తొలగింపుపై భారీ కుట్ర : ప్రసంగం చివరలో తేజస్వి యాదవ్, బీజేపీ మరియు ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను అక్రమంగా తొలగించడానికి భారీ కుట్ర జరుగుతోందని అన్నారు.
“బతికున్న ఎందరో పేదలను చనిపోయినట్లుగా చూపి, వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఎన్నికల సంఘంతో కుమ్మక్కై బిహార్ ప్రజల ఓటు హక్కును కాలరాయాలని బీజేపీ చూస్తోంది. కానీ, మేం బిహారీలమని వారు గుర్తుంచుకోవాలి. ఖైనీలో సున్నం కలిపి ఎలాంటి హడావిడి లేకుండా తినగల సమర్థులం. మమ్మల్ని మోసం చేయడం ఎవరి తరం కాదు,” అంటూ తనదైన శైలిలో ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.


