Telugu states CM’s Meeting: తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదాల పరిష్కారానికి కేంద్రం కీలకంగా రంగంలోకి దిగింది. జలసమస్యలపై చర్చించేందుకు ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ భేటీకి ఆహ్వానం పంపుతూ కేంద్ర జల్‌శక్తి శాఖ ఒక సర్క్యులర్ విడుదల చేసింది. ఈ సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఆహ్వానించింది. సమావేశానికి హాజరయ్యే వీలుందా అని రెండు రాష్ట్రాల నుంచి స్పందన కోరింది. సమావేశానికి కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వం వహించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఈ సమావేశాన్ని ఓ అవకాశంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. కృష్ణా నదిపై రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నీటి కేటాయింపుల స్పష్టత, అలాగే ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం వంటి కీలక అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నీటి పంపిణీ, ప్రాధాన్య ప్రాజెక్టుల అభివృద్ధి వంటి విషయాల్లో కేంద్రం దృష్టిని ఆకర్షించేందుకు తగిన చర్చలు జరపనున్నట్టు సమాచారం.
మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సిద్ధం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (జులై 16) ఢిల్లీకి వెళ్తున్నారు. ఉదయం అమరావతిలోని తన నివాసం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకల్లా ఢిల్లీకి చేరుకోనున్నారు. అక్కడ ఆయన కేంద్రమంత్రులు అమిత్ షా, అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్‌లతో ముఖ్యమైన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ చర్చల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల అంశాలు ప్రధానంగా ఉండనున్నాయి. అలాగే చంద్రబాబు జులై 17వ తేదీ రాత్రి 9 గంటలకు తిరిగి విజయవాడ చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ఆయన జలవివాదాలపై కేంద్ర మంత్రులతోనూ ప్రత్యేకంగా చర్చించనున్నారని తెలుస్తోంది.
కృష్ణా-గోదావరి జలాల పంపిణీ విషయంలో గతంలో పలు తలెత్తిన విభేదాల నేపథ్యంలో, ఈ సమావేశం రెండు రాష్ట్రాలకు కీలకంగా మారనుంది. నీటి వనరులపై సమన్వయంతో ముందుకెళ్లే మార్గాలు ఈ సమావేశం ద్వారా ఏర్పడతాయని ఆశిస్తున్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హాజరుతో జరిగే ఈ చర్చలపై దృష్టి మొత్తం కేంద్రంగా మారింది.
ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇస్తుందా? లేక తెలంగాణ వైపు మొగ్గు చూపుతూ అనుమతిని నిరాకరిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం సమక్షంలో జరుగుతున్న ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.


