Thane School Horror: మహారాష్ట్రలోని ఠాణె జిల్లాలో జరిగిన ఒక అమానవీయ ఘటన యావత్ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం, బాలికల పట్ల దారుణంగా ప్రవర్తించడం తీవ్ర చర్చనీయాంశమైంది. పాఠశాల టాయిలెట్‌లో కనిపించిన కొన్ని రక్తపు మరకలు, చివరకు బాలికల ప్రైవేట్ భాగాలను తనిఖీ చేసే స్థాయికి చేరడం మానవత్వాన్ని మంటగలిపింది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు..?
ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయి..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఠాణె జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం (జులై 8న) ఒక తీవ్రమైన సంఘటన చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండగా, అక్కడ కొన్ని రక్తపు మరకలు కనిపించాయి. వాటిని చూసిన సిబ్బంది వెంటనే ఫొటోలు తీసి పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫొటోలను చూసిన ప్రిన్సిపాల్ ఆగ్రహంతో ఊగిపోయి, 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలందరినీ కన్వెన్షన్ హాల్‌కు పిలిపించారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/earthquake-in-delhi-4-4-magnitude-earthquake-hits-delhi-ncr/
అటెండర్లను రంగంలోకి దింపి:
హాల్‌లో సమావేశమైన బాలికల ఎదుట, టాయిలెట్‌లో కనిపించిన రక్తపు మరకల ఫొటోలను ప్రొజెక్టర్ ద్వారా పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించారు. ఆ తర్వాత, “మీలో ఎవరైనా పీరియడ్స్‌లో ఉన్నారా?” అని విద్యార్థినులను సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు, పీరియడ్స్‌లో ఉన్నవారిని ఒక వైపు, లేని వారిని మరో వైపు నిలబడమని ఆదేశించారు. ఈ నిర్ఘాంతపోయే ఘటన అక్కడితో ఆగలేదు. పాఠశాల యాజమాన్యం ఆదేశాల మేరకు, మహిళా అటెండర్లను రంగంలోకి దింపి, బాలికలను ఒక్కొక్కరిగా టాయిలెట్‌కు తీసుకెళ్లారు. అక్కడ వారి వస్త్రాలను బలవంతంగా తొలగించి, ప్రైవేట్ భాగాలను తనిఖీ చేశారు. ఈ అత్యంత అవమానకరమైన చర్యతో బాలికలు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు.
పాఠశాల సమయం ముగిసిన తర్వాత, ఇంటికి చేరుకున్న బాలికలు తమ తల్లిదండ్రులకు ఈ దారుణ సంఘటన గురించి ఏడుస్తూ వివరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. వెంటనే పాఠశాల వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని, పాఠశాల యాజమాన్యంపై, ఈ అమానుష చర్యకు పాల్పడిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొద్దిసేపు ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ALSO READ: https://teluguprabha.net/national-news/kharge-blasts-bjp-over-accidents/
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని సెక్షన్ 74 (మహిళ గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి లేదా నేరపూరిత బల ప్రయోగం), సెక్షన్ 76 (వస్త్రాలను తీయాలని బలవంతం చేయడం) కింద, అలాగే లైంగిక నేరాల నుంచి పిల్లలకు రక్షణ కల్పించే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాల ప్రిన్సిపాల్, నలుగురు ఉపాధ్యాయులు, అటెండెంట్, ఇద్దరు ట్రస్టీలతో సహా మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. విద్యార్థినుల పట్ల ఇలాంటి దారుణమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన విద్యా వ్యవస్థలో భద్రత, సున్నితత్వం గురించి తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.


