తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. దీంతో అన్ని పార్టీలు దూకుడు పెంచాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ తొలి జనరల్ కౌన్సిల్ సమావేశం తిరువన్మయూర్‌లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 17 కీలక తీర్మానాలను ఆ పార్టీ ఆమోదించింది. ఇందులో ముఖ్యమైన జాతీయ విద్యావిధానంలోని త్రిభాషా పాలసీ, లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన, వక్ఫ్ సవరణ బిల్ల కు వ్యతిరేంగా చేసిన తీర్మానాలు కూడా ఉన్నాయి.

వక్ఫ్ బిల్లును ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఈ సమావేశంలో టీవీకే నిర్ణయించింది. అదేవిధంగా రాష్ట్రంలో ద్విభాషా పాలసీకే కట్టుబడి ఉండాలని పార్టీ నిర్ణయం చేసింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా పాలసీని అమలు చేయాలని కోరడం సమాఖ్య విధానానికి విరుద్ధమని పేర్కొంది. రాజకీయాల కోసం మరో భాషను తమిళనాడుపై రుద్ధడాన్నిఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని స్పష్టంచేసింది.

ఇక లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు తప్పనిసరేమీ కాదని పేర్కొంటూ దానికి వ్యతిరేకంగా టీవీకే తీర్మానం చేసింది. ప్రతిపాదిత డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గుతుందని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం మాదక ద్రవ్యాలను నియంత్రించలేకపోవడాన్ని టీవీకే ఖండించింది. మత్స్యకారుల అంశాన్ని కూడా టీవీకే పార్టీ తన సమావేశంలో లేవనెత్తింది. మత్స్యకారుల సమస్యకు తమిళనాడు సర్కారు శాశ్వత పరిష్కారం చూపడంలేదని విమర్శించింది. అలాగే పరంధూర్‌లో న్యూ చెన్నై ఎయిర్‌పోర్టుకు వ్యతిరేకంగా కూడా తీర్మానం చేసింది. కాగా ఈ సమావేశం అనంతరం పార్టీ మహిళా కార్యకర్తలతో కలిసి విజయ్ భోజనం చేయడం ఆకట్టుకుంది.

