పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’ పేరిట భారత బలగాలు పాక్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) స్పందిస్తూ ‘పహల్గామ్‌లో మన అమాయక సోదరుల దారుణ హత్యకు ఇది భారత్ ఇచ్చిన సమాధానం’ అని వ్యాఖ్యానించారు.
అయితే ఈ దాడి తర్వాత పాక్ రేంజర్లు సరిహద్దు వెంబడి భారత గ్రామాల్లో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నారు. ఈ ఘటనలో పది మంది భారత పౌరులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఈ తరుణంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవులో ఉన్న సిబ్బందిని వెనక్కి రప్పించాలని పారా మిలిటరీ బలగాలకు అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు.