సోషల్ మీడియా.. దానివల్ల మంచి ఉంటుంది. చెడు ఉంటుంది. అప్పడప్పుడు వింతవింత వీడియోలు కనిపిస్తుంటాయి. అవే బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్నింటిని చూస్తే.. ఈ పని ఇలా కూడా చేయొచ్చా అనిపిస్తుంటుంది. కొత్త కొత్త ఐడియాలతో సరికొత్త వీడియోలు చేస్తుంటారు. అలాంటి వీడియోల్లో ఓ వీడియో బాగా వైరలవుతోంది. అది చూస్తే.. తలస్నానం ఇలా కూడా చేస్తారా ? అని ఖచ్చితంగా అనుకుంటారు.
షవర్ లేకుండా.. ఎంచక్కా తక్కువనీటితో తలస్నానం కానిచ్చేశాడు. రోమ బల్వానీ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు. ఓ వ్యక్తి నీటితో ఉన్న క్యాన్ ను తన వీపునకు టవల్ తో కట్టుకున్నాడు. క్యాన్ మూతి భాగం తన తలవైపున ఉండేలా కట్టేశాడు. క్యాన్ మూత తీశాడు. కింద కూర్చుని, తల ముందు భాగంలో ఓ టబ్ పెట్టుకున్నాడు. తలపై షాంపూ రుద్దుతూ.. నీరు పోసుకోవాల్సినప్పుడల్లా నడుము భాగాన్ని పైకి ఎత్తుతూ క్యాన్ లో నీటిని తన తలపైకి వచ్చేలా ఏర్పాటు చేసుకున్నాడు.
ఇందులో విశేషం ఏంటంటే.. నీటిని ఆదా చేయడం. షవర్ కింద తలస్నానం చేస్తే.. అవసరానికి మించిన నీరు వాడేస్తుంటాం కదా. నీటి కొరత ఉన్నప్పుడు ఇలా తలస్నానం చేయొచ్చని చెప్పేందుకు ఈ వీడియో నిదర్శనంగా నిలుస్తుంటే.. కొందరు మాత్రం ఇది అతని పేదరికానికి నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు.